GT vs RR, Qualifier 1: ఐపీఎల్‌ 2022 క్వాలిఫయర్‌ 1లో రాజస్థాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. తనదైన బ్యాటింగ్‌తో అలరించింది. ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్‌కు 189 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (47; 26 బంతుల్లో 5x4 3x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. జోస్‌ బట్లర్‌ (89; 56 బంతుల్లో 5x4 3x6) డెత్‌లో దంచికొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (28; 20 బంతుల్లో 2x4 2x6) రాణించాడు. గుజరాత్‌లో యశ్‌ దయాల్‌, హార్దిక్‌ పాండ్య, సాయి కిషోర్‌, షమి తలా ఓ వికెట్‌ పడగొట్టారు.




పవర్ ప్లేలో సంజు, డెత్ లో బట్లర్


కెప్టెన్‌ సంజు శాంసన్‌ టాస్‌ ఓడిపోవడంతో ఎప్పట్లాగే రాజస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ (3; 8 బంతుల్లో) జట్టు స్కోరు 11 వద్దే యశ్‌ దయాల్ బౌలింగ్‌లో పెవిలిన్‌కు వెళ్లాడు. మరోవైపు జోస్‌ బట్లర్‌ అత్యంత నెమ్మదిగా ఆడటంతో సంజు అగ్రెసివ్‌గా ఆడాడు. క్రీజులో నిలబడి అలవోకగా సిక్సర్లు, బౌండరీలు దంచాడు. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించాడు దాంతో పవర్‌ప్లేలో రాజస్థాన్‌ 55 పరుగులు చేసింది. పదో ఓవర్‌ ఆఖరి బంతికి సంజూను సాయి కిషోర్‌ ఔట్‌ చేసి గుజరాత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న దేవదత్‌ పడిక్కల్‌ను జట్టు స్కోరు 116 వద్ద హార్దిక్‌ పాండ్య బౌల్డ్‌ చేయడంతో స్కోరువేగం తగ్గింది. రషీద్‌ ఖాన్‌ అస్సలు బౌండరీలు కొట్టనివ్వలేదు. 16 ఓవర్లకు రాయల్స్‌ 127/3తో నిలిచింది. ఆ తర్వాత 2 ఓవర్లలో బట్లర్‌ 7 బౌండరీలు కొట్టడటంతో స్కోరు 159/3కి చేరింది. ఆ తర్వాతా అదే జోరు కొనసాగించడంతో రాజస్థాన్‌ 188/6కు చేరుకుంది.