ఐపీఎల్ 2022లో 49వ మ్యాచులో ఓ బ్యూటిఫుల్ సీన్ కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడ్డ ఈ మ్యాచులో ఓ ప్రేమికుల జంట ఒక్కటైంది. ఓ అందమైన అమ్మాయి తనకెంతో ఇష్టమైన అబ్బాయికి నేరుగా ప్రపోజ్ చేసింది. స్వయంగా అతడు ఆర్సీబీ ఫ్యాన్ కావడం విశేషం.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం ఈ మ్యాచ్ జరిగింది. సీఎస్‌కే ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో స్టాండ్స్‌లోని ఓ అమ్మాయి రింగు తీసుకొని మోకాళ్లపై కూర్చొని అబ్బాయికి ప్రపోజ్ చేసింది. అతడూ ఆమె ప్రపోజ్‌ను యాక్సెప్ట్ చేశాడు. దాంతో అక్కడే ఉన్న అభిమానుల గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించారు. మ్యాచును కవర్ చేస్తున్న కెమేరామెన్ సైతం ఆ అద్భుతమైన సన్నివేశాన్ని షూట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఈ ప్రేమ జంటను అభినందించాడు. 'స్మార్ట్ గర్ల్ ఆర్సీబీ అభిమానికి ప్రపోజ్ చేస్తోంది. అతడు ఆర్సీబీకి నమ్మకమైన అభిమానే అయితే జీవిత భాగస్వామికీ అలాగే ఉంటాడు. వెల్డన్! ప్రపోజ్ చేయడానికి ఇదో మంచి రోజు' అని అతడు ట్వీట్ చేశాడు. ఈ మ్యాచులో బెంగళూరు 13 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
ఆర్సీబీ, సీఎస్‌కే మ్యాచ్ ఎలా సాగిందంటే?
CSK vs RCB, Match Highlights: ఐపీఎల్ 2022లో 49వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలిచింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయం అందుకుంది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పుణె వేదికగా జరిగిన మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను 13 రన్స్ తేడాతో ఓడించింది. 174 టార్గెట్ ఛేదనకు దిగిన ధోనీ సేనను 160/8కే పరిమితం చేసింది. డేవాన్ కాన్వే (56; 37 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీ వృథా అయింది. రుతురాజ్ గైక్వాడ్ (28; 23 బంతుల్లో 3x4, 1x6), మొయిన్ అలీ (34; 27 బంతుల్లో 2x4, 2x6) రాణించారు. అంతకు ముందు ఆర్సీబీలో మహిపాల్ లోమ్రర్ (42; 27 బంతుల్లో 3x4, 2x6) అమేజింగ్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. డుప్లెసిస్ (38; 22 బంతుల్లో 4x4, 1x6), దినేశ్ కార్తీక్ (26*; 27 బంతుల్లో 1x4, 2x6) మెరిశారు.
డేవాన్ 'డెవిల్' ఇన్నింగ్స్
ఛేదనకు దిగిన సీఎస్‌కేకు శుభారంభం దొరికింది. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. పవర్‌ప్లే ముగిశాక రుతురాజ్‌ను షాబాజ్ ఔట్ చేసి ఆర్సీబీకి తొలి వికెట్ అందించాడు. మరో 5 పరుగులకే రాబిన్ ఉతప్ప (1)ను మాక్స్‌వెల్ పెవిలియన్ పంపించాడు. అంబటి రాయుడు (10)నూ అతడే క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో మొయిన్ అలీ అండతో కాన్వే అదరగొట్టాడు. చక్కని బౌండరీలు బాదుతూ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కీలక సమయంలో 14.1వ బంతికి అతడిని హసరంగ ఔట్ చేసి మ్యాచును టర్న్ చేశాడు. దాంతో 15 ఓవర్లకు సీఎస్‌కే 118/4తో టైమౌట్‌కు వెళ్లింది. 10 పరుగుల వ్యవధిలోనే జడ్డూ (౩), మొయిన్ అలీని వరుస ఓవర్లలో హర్షల్ పటేల్ ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. గెలిపిస్తాడనుకున్న ధోనీ (2)ని 18.1వ బంతికి హేజిల్‌వుడ్ పెవిలియన్ పంపించడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు, 1 బౌండరీ వచ్చినా సీఎస్‌కే 160/8కి పరిమితం అయింది. హర్షల్ పటేల్ 3, మాక్సీ 2 వికెట్లు తీశారు.