ఐపీఎల్‌ 2022లో 50వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తలపడుతున్నాయి. బ్రబౌర్న్‌ మైదానం ఇందుకు వేదిక. ఈ రెండు జట్లకు ఇది అత్యంత కీలకమైన మ్యాచుగా మారనుంది. గెలిస్తే ప్లేఆఫ్స్‌ దిశగా ముందడుగు వేయొచ్చు. మరి వీరిలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?


సన్‌రైజర్సే పైచేయి.. అయినా?


ఈ సీజన్‌ ఆఖరి దశకు చేరుకుంటోంది. అందుకే ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్‌ కీలకమే! ఈ దశలో గెలిస్తేనే సులభంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు. అందుకే నేడు జరిగే పోరు దిల్లీ, హైదరాబాద్‌కు డూ ఆర్‌ డై లాంటిది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన కేన్‌ సేన్‌ ఆఖరి రెండు మ్యాచుల్లో ఓడింది. 9 మ్యాచుల్లో 5 గెలిచి 4 ఓడి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు దిల్లీ 9 మ్యాచుల్లో 4 గెలిచి 5 ఓడి 8 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మెరుగైన రన్‌రేట్‌ ఉన్న పంత్‌ సేన ఈ మ్యాచును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌లో 20 సార్లు తలపడ్డాయి. 11 సార్లు హైదరాబాద్‌ గెలవగా దిల్లీ 9 గెలిచింది.


డేవిడ్‌ భాయ్‌ ఏం చేస్తాడో?


ఐపీఎల్‌ 2022లో దిల్లీ క్యాపిటల్స్‌ది విచిత్రమైన పరిస్థితి. అన్ని వనరులు ఉన్నా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది లేదు. ఒకటి గెలిస్తే మరోటి ఓడిపోతోంది. చివరి మ్యాచులో లక్నో చేతిలో త్రుటిలో ఓటమి పాలైంది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. వారిద్దరూ విఫలమైనప్పుడే ఇబ్బంది పడుతోంది. మిచెల్‌ మార్ష్‌ స్థాయికి తగినట్టు ఆడలేదు. రిషభ్ పంత్‌లో ఫైర్‌ కనిపించడం లేదు. రోమన్‌ పావెల్‌ లయ అందుకోవడం శుభసూచకం. బౌలింగ్‌ పరంగా వారికి సమస్యలు కనిపించడం లేదు. సన్‌రైజర్స్‌ మాజీ ఆటగాడు కావడంతో వార్నర్‌ భాయ్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.


నట్టూ, సుందర్‌ గాయాల మాటేంటి?


రెండు వరుస ఓటములతో సీజన్‌ ఆరంభించిన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత వరుసగా 5 గెలిచింది. ఇప్పుడు వరుసగా 2 ఓడింది. పటిష్ఠమైన బౌలింగ్‌ యూనిట్‌ ఉన్న ఆరెంజ్‌ ఆర్మీ చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచులో ఒక్క వికెట్టైనా తీయకపోవడం ఆశ్చర్యమే! పైగా భారీ స్కోరు ఇచ్చేశారు. కేన్‌ మామ పరుగులు బాకీ ఉన్నాడు. అభిషేక్‌ శర్మ ఇంటెంట్‌ బాగుంది. రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, పూరన్‌ నిలకడగా ఆడితే గెలుపు సులువే. చివరి రెండు మ్యాచుల్లో బౌలింగ్‌ కాస్త బలహీనంగా కనిపించినా నమ్మకంతో ఆడితే తిరుగుండదు. స్పిన్‌ విభాగంలో వీక్‌నెస్‌ కనిపిస్తోంది. నటరాజన్‌, సుందర్‌ గాయాల పరిస్థితిపై అప్‌డేట్‌ లేదు.


DC vs SRH Probable XI


దిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, రిషభ్ పంత్‌, లలిత్‌ యాదవ్‌, రోమన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, చేతన్‌ సకారియా


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేన్‌ విలియమ్సన్‌, అభిషేక్ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ / జే సుచిత్‌, మార్కో జన్‌సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌ / కార్తీక్‌ త్యాగి