CSK Player Devon Conway Scores 3rd Fifty In IPL 2022: పెళ్లి తరువాత జోష్ పెంచాడు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఆటగాడు డేవాన్ కాన్వే. ఐపీఎల్ 2022లో ఒక్క మ్యాచ్ ఆడిన అనంతరం జట్టుకు దూరమైన కాన్వే ఏప్రిల్ నెలలో తన ప్రియురాలు కిమ్ వాట్సన్‌ను దక్షిణాఫ్రికాలో వివాహం చేసుకున్నాడు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చిన డేవాన్ కాన్వే సీఎస్కే టీమ్‌మెట్స్‌కు పార్టీ సైతం ఇచ్చాడు.
ధోనీ ఇన్.. కాన్వే ఇన్ ఫామ్..
ఓవైపు రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఎంఎస్ ధోనీ సీఎస్కే బాధ్యతలు స్వీకరించాడు. డేవాన్ కాన్వేను తుది జట్టులోకి తీసుకుని అతడిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వివాహం తరువాత సీఎస్కే జట్టులో మరోసారి చోటు దక్కించుకున్న కాన్వే IPL 2022లో ఆడింది నాలుగు మ్యాచ్‌లు, అయితే వరుసగా మూడు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు బాదేశాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెవాన్ కాన్వే (87: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మరో హాఫ్ సెంచరీ చేయడంతో వరుసగా 3 మ్యాచ్‌లలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో సీఎస్కే ఆటగాడిగా నిలిచాడు. కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఢిల్లీ బౌలర్లపై తన బ్యాటింగ్ ప్రతాపం చూపించాడు.
సీఎస్కే నుంచి మూడో ఆటగాడిగా..
ఐపీఎల్ సీజన్ 14 సీజన్లలో కేవలం ఇద్దరు సీఎస్కే ఆటగాళ్లు మాత్రమే మూడు వరుస మ్యాచ్‌లలో అర్ధ శతకాలు సాధించారు. తొలిసారిగా ఐపీఎల్ 2020లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ 2021లో అప్పటి చెన్నై ఆటగాడు (ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్) ఫాఫ్ డుప్లెసిస్ 3 వరుస మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేయగా.. తాజాగా ఈ ఫీట్‌ను డేవాన్ కాన్వే సాధించాడు.
తక్కువ ధరకే సీఎస్కే కొనుగోలు..
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సంచలనం డేవాన్ కాన్వేను ఐపీఎల్ 2022 మెగా వేలంలో సీఎస్కే ఫ్రాంచైజీ తక్కువ ధరకు సొంతం చేసుకుంది. కేవలం బేస్ ప్రైస్ రూ.1 కోటి కాగా, అదే ధరకు కాన్వేను దక్కించుకుని తమ నిర్ణయం సరైనదని నిరూపించింది. సీజన్‌లో తొలి మ్యాచ్ తరువాత జట్టులో చోటు కోల్పోయిన కాన్వే, మ్యారేజ్ తరువాత నాలుగు మ్యాచ్‌లు ఆడగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదేశాడు. ఈ మూడు మ్యాచ్‌లతో పాటు ఓవరాల్‌గా 4 మ్యాచ్‌లు నెగ్గిన సీఎస్కే పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.
2020లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టు నుంచి ఆహ్వానం అందుకున్న డేవాన్ కాన్వే 20 టీ20లలో 50 సగటుతో 602 రన్స్ చేశాడు. 3 వన్డేలాడిన కాన్వే 75 సగటుతో 225 పరుగులు చేయడం విశేషం.
Also Read: SRH vs RCB, Match Highlights: త్రిపాఠి SRH ఘనాపాటి! హసరంగ ధాటికి హైదరాబాద్ బొటాబొటి!