SRH vs RCB, Match Highlights: ఐపీఎల్‌ 2022లో 54వ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) అదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)పై తిరుగులేని విజయం అందుకుంది. గత మ్యాచు ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. 67 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ వైపు ముందడుగు వేసింది. 193 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 125కి ఆలౌట్ చేసింది. రాహుల్‌ త్రిపాఠి (58; 37 బంతుల్లో 6x4, 2x6) ఒంటరి పోరాటం చేశాడు. అంతకు ముందు బెంగళూరులో డుప్లెసిస్‌ (73*; 50 బంతుల్లో 8x4, 2x6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రజత్‌ పాటిదార్‌ (48; 38 బంతుల్లో 4x4, 2x6), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (33; 24 బంతుల్లో 3x4, 2x6), దినేశ్ కార్తీక్ (30*; 0 బంతుల్లో 1x4, 4x6) మెరుపు షాట్లతో అలరించాడు.


వరుసగా 4వ ఓటమి


అసలే మూమెంటమ్‌ లేదు! ఎదురుగా భారీ టార్గెట్‌! దాంతో సన్‌రైజర్స్‌ కుదురుగా ఛేదించగలదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఆఖరికి అవే నిజమయ్యాయి. పరుగుల ఖాతా తెరవకముందే కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రనౌట్‌ అయ్యాడు. మాక్సీ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి బంతికే గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌ ఐదో బంతికి మరో ఓపెనర్‌ అభిషేక్ శర్మ (0) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 1-2తో ఇబ్బందుల్లో పడ్డ సన్‌రైజర్స్‌ను రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్‌ మార్‌క్రమ్‌ (21; 27 బంతుల్లో 1x4, 1x6) రక్షించే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 45 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. జోరు పెంచే క్రమంలో మార్‌క్రమ్‌ను జట్టు స్కోరు 51 వద్ద హసరంగ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో నికోలస్‌ పూరన్‌ (19; 14 బంతుల్లో 2x4, 1x6)తో కలిసి త్రిపాఠి 23 బంతుల్లో 38 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పాడు. జట్టు స్కోరు 89 వద్ద పూరన్‌, 114 వద్ద త్రిపాఠి పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ ఓటమి లాంఛనంగా మారింది. హసరంగ (5/18) బంతితో దుమ్మురేపాడు.


RCBలో అంతా కొట్టారు


మధ్యాహ్నం మ్యాచ్‌ కావడంతో బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనుకున్న ఓపెనింగ్‌ మాత్రం వారికి దక్కలేదు. జగదీషా సుచిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి బంతికే విరాట్‌ కోహ్లీ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతడు తడబడుతున్న సంగతి తెలిసిందే. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్‌ చేజార్చుకోవడంతో ఆర్సీబీ వెనబడుతుందేమో అనిపించింది! కానీ డుప్లెసిస్‌, రజత్‌ పాటిదార్‌ మెరుపు షాట్లు ఆడుతూ దుమ్మురేపారు. 6.5 ఓవర్లకే 50 పరుగులు చేసేశారు. డుప్లెసిస్‌ 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 105 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ సాధించారు. 12.2వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి రజత్‌ ఔటయ్యాడు. దాంతో మాక్సీతో కలిసి డుప్లెసిస్‌ చెలరేగాడు. మూడో వికెట్‌కు 37 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో డీకే 3 సిక్సర్లు, 1 బౌండరీ కొట్టడంతో స్కోరు 192/3కు చేరుకుంది.