ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (99: 57 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు), డెవాన్ కాన్వే (85 నాటౌట్: 55 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) రాణించారు. సన్‌రైజర్స్ విజయానికి 120 బంతుల్లో 203 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో 1000 పరుగుల మార్కును రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు అందుకున్న రుతురాజ్ గైక్వాడ్... సచిన్ టెండూల్కర్ రికార్డును ఈక్వల్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా 31 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించాడు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి సన్‌రైజర్స్ బౌలర్ల నుంచి అస్సలు ప్రతిఘటన ఎదురు కాలేదు. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే గేర్లు క్రమంగా మారుస్తూ వెళ్లారు. సన్‌రైజర్స్ బౌలర్లకు ఎక్కడా ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఆడారు. మొదటి 10 ఓవర్లలో చెన్నై వికెట్ నష్టపోకుండా 85 పరుగులు సాధించింది.


మొదటి వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యం అందించిన అనంతరం సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. చివర్లో డెవాన్ కాన్వే వేగంగా ఆడటంలో చెన్నై 200 పరుగుల మార్కును దాటింది. చివరి ఓవర్లో కాన్వే రెండు బౌండరీలు సాధించాడు. చాలా కాలం తర్వాత వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని అంత ప్రభావం చూపించలేకపోయాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి.