AB de Villiers RCB: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులకు గుడ్‌న్యూస్‌! 'మిస్టర్‌ 360' డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ మళ్లీ ఆ జట్టులో చేరనున్నాడు. అయితే ఈసారి క్రికెటర్‌గా కాదండోయ్‌! ఆ జట్టు మెంటార్‌గా వస్తున్నాడని సమాచారం. ఇంటర్నెట్లో ఇప్పటికే ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (Indian Premier Leauge) మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ క్రికెటర్లలో ఏబీ డివిలియర్స్‌  (AB de Villers) ఒకడు. అతడు క్రీజులోకి వస్తుంటేనే ఫ్యాన్స్‌ పరవశించి పోతారు. క్రీజులో నిలబడి కొడతాడో, కూర్చొని కొడతాడో, పక్కకు తిరిగి దంచుతాడో, అప్పర్‌ కట్స్‌తో అలరిస్తాడో, ఆఫ్‌సైడ్‌ దూరంగా జరిగి మోకాళ్లపై కూర్చొని లెగ్‌సైడ్‌ కొడతాడోనని ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. అందుకే అతడికి ఇండియాలో ఫ్యాన్ బేస్‌ చాలా ఎక్కువ.


ఆర్‌సీబీ (RCB) పేరు వింటేనే మొదట అందరికీ గుర్తొచ్చేది విరాట్‌ కోహ్లీ (Virat Kohli), ఏబీ డివిలియర్స్‌ జోడీ! వీరిద్దరూ క్రీజులో నిలబడి కొట్టిన షాట్లను ఎవ్వరూ మర్చిపోలేరు. ఒకరితో మరొకరు పోటీపడి పరుగులు చేస్తారు. సెంచరీలు బాదేస్తారు. అయితే గత సీజన్ తర్వాత ఐపీఎల్‌కు (IPL) దూరమవుతున్నానని ఏబీడీ ప్రకటించాడు. అంతకు ముందే అతడు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు.


బెంగళూరుతో ఏబీడీకి విడదీయరాని అనుబంధం ఉంది. పైగా డ్యాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ క్రికెటర్‌గా పేరుంది. క్రికెట్‌పై మంచి నాలెడ్జ్‌ ఉంది. అందుకే అతడి సేవలను ఉపయోగించుకోవాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ అనుకుంటోందని తెలిసింది. ఇప్పటికే అతడిని సంప్రదించి మెంటార్‌ పోస్టుకు ఒప్పించిందని సమాచారం.


విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆర్‌సీబీ మరొకరిని నాయకుడిగా ప్రకటించలేదు. ఆ జట్టు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలానే ఉన్నాయి. అందుకే మార్చి 12న తమ కెప్టెన్‌ ఎవరో బెంగళూరు ప్రకటించనుందని సమాచారం. ఇదే సమయంలో ఏబీ డివిలియర్స్‌ కొత్త పాత్ర గురించీ చెబుతారని అంటున్నారు. అతడు మళ్లీ కనిపిస్తే మాత్రం అభిమానులు ఫుల్లు హ్యాపీ!


ఐపీఎల్‌లో ఏబీడీ 184 మ్యాచులు ఆడాడు. 39.71 సగటు, 151 స్ట్రైక్‌రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ౩ సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. 413 బౌండరీలు, 250 సిక్సర్లు కొట్టాడు.