MS Dhoni: ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా ఓటములను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోందని సమాచారం. ప్రపంచ క్రికెట్లో భారత్‌ను దుర్భేద్యమైన జట్టుగా మార్చేందుకు నడుం బిగించనుంది. సీనియర్‌ ఆటగాళ్లను సాగనంపడమే కాకుండా భవిష్యత్తు నాయకులను తయారు చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఐసీసీ ట్రోఫీల విజేత ఎంఎస్ ధోనీని డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌గా నియమించాలని అనుకుంటోంది. మరి ఇందుకు మహీ అంగీకరిస్తాడో లేదో చూడాలి.


ఒకప్పటితో పోలిస్తే టీమ్‌ఇండియా ఇప్పుడు విపరీతంగా క్రికెట్‌ ఆడుతోంది. ఏడాది సాంతం మూడు ఫార్మాట్లలో మ్యాచులు ఉంటున్నాయి. ఏ రెండు సిరీసుల మధ్యా కనీసం వారం రోజుల విశ్రాంతి దొరకడం లేదు. పైగా అన్ని సిరీసులను చూసుకోవడం ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు కష్టంగా మారుతోంది. ఆయనపై పనిభారం తగ్గించడంతో పాటు ప్రపంచకప్‌లు గెలిచే జట్టును తయారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అలవోకగా ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఎంఎస్ ధోనీ అనుభవం, విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే అతడికి అత్యవసర సందేశం పంపించారని తెలిసింది. త్వరలో జరిగే బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.


గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ఎంఎస్‌ ధోనీ మెంటార్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌ అక్కడే జరగడం, అప్పటికే మహీ అక్కడ ఉండటంతో ఇది సాధ్యమైంది. ఏదేమైనా ఈ మెగాటోర్నీలో భారత్‌ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం సెమీ ఫైనల్‌కైనా వెళ్లలేదు. కచ్చితంగా గెలవాల్సిన పాక్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఈ సారి సెమీస్‌కు చేరినా ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. అందుకే టీ20 సెటప్‌ను సరిచేసేందుకు ధోనీకి కీలక బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తోంది. వచ్చే ఐపీఎల్‌ తర్వాత లీగ్‌కు అతడు గుడ్‌బై చెప్పేస్తాడని ఊహాగానాలు వస్తున్నాయి. అతడిని నచ్చిన ఆటగాళ్లతో ముందుకెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ నెలాఖర్లో బీసీసీఐ అపెక్స్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఇద్దరు కెప్టెన్ల అంశాన్నీ ఇందులో చర్చించనున్నారు.