IPL 2025 MI VS CSK Live Updates: భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవ‌లం ఐపీఎల్లో మాత్ర‌మే ఆడ‌తాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కేవ‌లం ఐపీఎల్లో మాత్ర‌మే సంద‌డి చేస్తున్నాడు. 43 ఏళ్ల వ‌య‌సులోనూ ఫుల్ ఫిట్ గా ఉంటూ సంద‌డి చేస్తున్నాడు.  తాజాగా ధోనీని ఒక పెళ్లిలో క‌లిసిన మాజీ స్పిన్న‌ర్, ట‌ర్బోనేట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ చాలా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అస‌లు ఈ వయ‌సులో ఇంత ఫిట్ గా ఎలా ఉండ‌గ‌లుగుతున్నావ‌ని త‌ను అడిగిన ప్ర‌శ్న‌కు ధోనీ స‌మాధానం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌లో క్రికెట్ ఆడాల‌నే బ‌ల‌మైన కోరిక ఉండ‌టంతోనే ఇలా ఫిట్ గా ఉంటున్న‌ట్లు తెలిపాడు.


ఏడాదంతా ఏ క్రికెట్ టోర్నీ ఆడ‌కుండా, కేవ‌లం ఐపీఎల్ కోస‌మే ఇంత ఫిట్ గా ఉండ‌టం చాలా క‌ష్ట‌మైన విష‌యం అయిన‌ప్ప‌టికీ, క్రికెట్ కోసం త‌ను ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించాడు. ఏడాదంతా ఇంత‌టి ఫిట్ నెస్ మెయింటేన్ చెయ్య‌డం చాలా క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించాడు. 2019లో రిటైర్ అయిన ధోనీ.. కేవ‌లం ఐపీఎల్లో మాత్ర‌మే ఆడుతున్నాడు. అత‌ను రిటైర్మెంట్ తీసుకుని ఐదేళ్లు గ‌డిచిన నేప‌థ్యంలో అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ హోదాలో ఐపీఎల్లో ఆడుతున్నాడు. 


గంట‌ల త‌ర‌బ‌డి ప్రాక్టీస్..
ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అభిమానులు ముద్దుగా ధోనీని 'త‌ల'(నాయ‌కుడు) అని పిలుచుకుంటారు.  ధోనీ ప్రాక్టీస్ గురించి ఇంట‌రెస్టింగ్ విష‌యాల‌ను భ‌జ్జీ పంచుకున్నాడు. ప్రాక్టీస్ లో అంద‌రికంటే ముందుగా వ‌చ్చి, ఆఖ‌రున వెళ్లే వ్య‌క్తి 'త‌ల‌' అని కొనియాడాడు. రోజు రెండు నుంచి మూడు గంట‌ల‌పాటు ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. వీలైనంత ఎక్కువ‌గా ప్రాక్టీస్ చేస్తేనే బంతిని బాగా టైమ్ చేయ‌గ‌ల‌మ‌ని గుర్తు చేశాడు. అలా 43 ఏళ్ల వ‌య‌సులోనూ ధోనీ ఇంతగా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని ప్ర‌శంసించాడు. 


ధోనీ లోయ‌ర్ మిడిలార్డ‌ర్లో ఎందుకు వ‌స్తాడంటే..?
వ‌య‌సు రిత్యానే ధోనీ లోయ‌ర్ మిడిలార్డ‌ర్లో బ్యాటింగ్ కు వ‌స్తాడ‌ని మాజీ క్రికెటర్, కామెంటేట‌ర్ ఆకాశ్ చొప్రా విశ్లేషించాడు. చాలామంది ధోనీ చాలా ముందుగా బ్యాటింగ్ కి వ‌స్తే బాగుంటుంద‌ని పేర్కొంటార‌ని, అయితే ఈ వ‌య‌సులో ముందుగా బ్యాటింగ్ కు వ‌చ్చి, అంత‌సేపు ధోనీ బ్యాటింగ్ చేయ‌లేడని పేర్కొన్నాడు. ముందుగా బ్యాటింగ్ కు వ‌చ్చి 40కి పైగా బంతులు ఎదుర్కోల‌న‌ని ధోనీకి తెలుస‌ని, అందుకే చాలా ఆల‌స్యంగా క్రీజులోకి వ‌స్తున్నాడ‌ని పేర్కొన్నాడు. ఇక ఏజ్ పెరిగినా, కీపింగ్ లో ధోనీ సామ‌ర్థ్యం త‌గ్గ‌లేద‌ని కొనియాడాడు.



వికెట్ల వెన‌కాల చురుకుగా క‌దులుతూ, క్ష‌ణాల్లో బెయ‌ల్స్ గిరాటేయడం ధోనీ స్టైల్ అని కొనియాడాడు. ధోనీ స్టంపింగ్ చేస్తే ప‌దికి 9.5 సార్లు ఔట‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌ని సూత్రీక‌రించాడు. మెరుపు వేగంతో ధోనీ చేతులు వికెట్ల వెన‌కాల క‌దులుతాయ‌ని, ఆ స్పీడ్ ని వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మ‌ని పేర్కొన్నాడు. ఈనెల 22న ఐపీఎల్ ప్రారంభ‌మ‌వుతుండ‌గా, 23న ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగే మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతుంది. ఈ మ్యాచ్ లో ధోనీ బ‌రిలోకి దిగ‌డం ఖాయం.