GT vs KKR Match Highlights: ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో 28 పరుగులు కావాలి. క్రీజులో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్. ఎదురుగా అనుభవం లేని గుజరాత్ బౌలర్ యష్ దయాళ్. అయినా పరిస్థితి గుజరాత్‌కే అనుకూలం. ఎందుకంటే ఒక్క డాట్ వేస్తే గుజరాత్ మ్యాచ్ గెలిచినట్లే. దీనికి తోడు హేమాహేమీలు అయిన రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు బంతి బంతికీ వచ్చి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.


ఈ దశలో రింకూ సింగ్ అద్భుతం చేశాడు. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్‌కతాను గెలుపు బాట పట్టించాడు. మ్యాచ్‌లో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. గుజరాత్‌ను గూబ గుయ్యిమనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించిన ఆనందాన్ని రషీద్ ఖాన్‌కు దూరం చేశాడు. రింకూ బాదుడు ముందు రషీద్ హ్యాట్రిక్ కూడా చిన్నబోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. గుజరాత్ తరఫున విజయ్ శంకర్ (63 నాటౌట్: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ (53: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ కొట్టేశాడు.


కోల్‌కతా తరఫున రింకూ సింగ్ (48 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్, ఆరు సిక్సర్లు) ఇన్నింగ్స్ డామినేట్ చేసినప్పటికీ అంతకు ముందు వెంకటేష్ అయ్యర్ (83: 40 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు), కెప్టెన్ నితీష్ రానాల (45: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌లను కూడా తక్కువ చేయలేం. అసలు మ్యాచ్‌లో కోల్‌కతాను నిలబెట్టిందే వీరిద్దరు. మొదటి 14 బంతుల్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసిన రింకూ తర్వాతి ఏడు బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 40 పరుగులు కొట్టేశాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వారి ఇన్నింగ్స్ మెల్లగా ఆరంభం అయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా (17: 17 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుటయ్యాడు. అయితే వన్ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌తో (53: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి శుభ్‌మన్ గిల్ (39: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరు రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 11.3 ఓవర్లలో గుజరాత్ 100 పరుగుల మార్కును దాటింది. అనంతరం శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు.


ఆ తర్వాత వచ్చిన అభినవ్ ముకుంద్ (14: 8 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ దశలో విజయ్ శంకర్ (63 నాటౌట్: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) గుజరాత్ టైటాన్స్ స్కోరును నెక్స్ట్ లెవల్‌కు తీసువెళ్లాడు. వరుస బౌండరీలతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను అల్లాడించాడు. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ చివరి 15 బంతుల్లో గుజరాత్ 51 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయ్ శంకర్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం విశేషం. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.