Fans Slams Rcb After Huge Loss Against Kkr Demand Rcbw Players In Playing Xi: ఐపీఎల్‌(IPL) 17వ సీజన్‌లో ఈ సాలా కప్‌ నామ్‌దే అంటూ బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB) మరోసారి నిరాశపరిచింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని కేకేఆర్‌(KKR) జట్టు 7 వికెట్లు తేడాతో చిత్తు చేసింది. 182 పరుగులు చేసినా.. బౌలర్లు రాణించకపోవడంతో ఘోరంగా  ఓడిపోయింది. కాస్త కూడా కష్టపడకుండా  మ్యాచ్‌ను సునాయాసంగా గాలికి  వదిలేసింది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడినా.. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి గాడిన పడినట్లే అనిపించింది. కానీ మూడో మ్యాచ్‌లో కోల్‌కత్తా చేతిలో పరాజయంపాలైంది. దీంతో ఆర్సీబీపై నెటిజన్లు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో  WPL 2024లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ ఉమెన్స్‌ టీమ్‌లోని ప్లేయర్లతో పోలుస్తూ ఎగతాళి చేస్తున్నారు. ఈసారి ఆర్సీబి పురుషుల జట్టు కూడా టైటిల్‌ సాధిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు  ఈ ఓటమి తరువాత ఇలా  అయితే  టైటిల్‌ గెలవడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.  సోషల్‌ మీడియా వేదికగా తమ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మనవల్ల కాదు గానీ  మహిళలను జట్టులోకి తీసుకోవాలంటూ మీమ్స్‌  చేస్తున్నారు. 


ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా ఆ జట్టుకు విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంది. విరాట్‌ కోహ్లీ, క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌ వంటి స్టార్లతో నిండిన ఆ జట్టు మాత్రం.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. దానికి ప్రధాన కారణం బౌలింగ్‌. దిగ్గజ ప్లేయర్లు ఉన్నా బౌలింగ్‌ వీక్‌గా ఉంటడంతో ఆ జట్టు టైటిల్‌ వేటలో వెనకబడి పోయింది. 


మీ వల్ల కాదు బ్రో.. 


చిన్న లక్ష్యాన్ని కూడా కాపాడుకుంటూ అమ్మాయిలు పెద్ద  విజయం సాధించారు. ఫ్రాంఛైజీకి టైటిల్‌ అందించారు. దీంతో మహిళలతో పొలుస్తూ నెటిజన్లు పురుషుల జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఉన్న బౌలర్ల వల్ల చేతకావడం లేదని,  బౌలింగ్ కోసం మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్‌సీబీని గెలిపించిన ఎలీస్ పెర్రీ, శ్రేయాంక్ పాటిల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఎగతాళి చేస్తున్నారు.  స్పిన్‌ కోసం  శ్రేయాంక పాటిల్ ను, ఆల్‌రౌండర్‌గా  ఎలీస్‌ పెర్రీని జట్టులోకి తీసుకోద్దాం అని  సలహాలు ఇస్తున్నారు.  అంటే ఇంత కొట్టినా విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ చేశాడని,  అలా ఆడడమే బెంగళూరు ఓటమికి కారణమని మండిపడుతున్నారు.  మహిళల జట్టు ఫొటో పురుషల జట్టు ఫొటోలను వాడుతూ మీమ్స్‌ వైరల్‌ చేస్తున్నారు. 


మ్యాచ్ పోయిందిలా.. 


కోల్‌కతా(KKR) చేతిలో బెంగళూరు(RCB) చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో సొంత వేదిక జట్లే నెగ్గాయి. కానీ ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారిగా ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. విరాట్‌ కోహ్లీ 83 పరుగులతో  రాణించడంతో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.