Virat Kohli breaks Chris Gayle, MS Dhoni's records in RCB vs KKR match: రికార్డుల రారాజుగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరపున అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. యూనివర్సల్ బాస్, విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ ఐపీఎల్‌లో 239 సిక్సులు బాది ఆర్సీబీ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఇప్పటివరకూ కొనసాగాడు. . కోహ్లీ మరో 2 సిక్స్ లు ఎక్కువ బాడీ 241 సిక్సర్లతో ఆర్సీబీ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా అగ్రస్థానం దక్కించుకున్నాడు.
ఐపీఎల్‌లో RCB తరఫున అత్యధిక సిక్సర్లు
241 - విరాట్ కోహ్లీ
239 - క్రిస్ గేల్
238 – ఏబీ డివిలియర్స్
67 - గ్లెన్ మాక్స్‌వెల్
50 – ఫాఫ్ డు ప్లెసిస్
క్యాచుల్లోనూ కాసుకకూర్చుంటాడు..
విరాట్ కోహ్లీ అంటే స్టార్ బ్యాటర్. ఎలాంటి బౌలర్‌పై అయినా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆధిపత్యం చెలాయించగల క్రికెటర్. ఎన్నో రికార్డులను నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. కానీ విరాట్ కోహ్లీ అంటే కేవలం బ్యాటింగ్‌లో అత్యుత్తమ రికార్డులే కాదు. ఫీల్డింగ్‌లోనూ ఓ అరుదైన రికార్డు విరాట్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్.. సురేష్ రైనాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో 109 క్యాచ్‌లను అందుకున్నారు. విరాట్ మరో క్యాచ్ పడితే సురేష్ రైనాను అధిగమిస్తాడు. కోహ్లీ మరో క్యాచ్ అందుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా తర్వాత కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. పొలార్డ్ 103 క్యాచ్‌లు పట్టాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 99 క్యాచ్‌లు అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రవీంద్ర జడేజా 97 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పేర్లు టాప్-5లో ఉన్నాయి. సురేష్ రైనా, కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో ఆడుతున్నారు.
ఇంత చేసినా తప్పని పరాజయం -బెంగళూరుకు రెండో లాస్
కోల్‌కతా(KKR) చేతిలో బెంగళూరు(RCB) చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో సొంత వేదిక జట్లే నెగ్గాయి. కానీ ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారిగా ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. విరాట్ కోహ్లీ 83 పరుగులతో రాణించడంతో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.