Fans accuse BCCI of setting up MS Dhoni’s ‘perfect farewell’ in Chennai: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఉత్సాహంగా సాగుతోంది. ధోనీ-కోహ్లీ(Dhoni-Kohli) మధ్య జరిగిన తొలి పోరుతో ప్రారంభమైన ఐపీఎల్ ఫీవర్ పతాక స్థాయికి చేరుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కేవలం తొలి దశ ఐపీఎల్ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ(BCCI)... ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వడం ఖాయమైంది.
గతంలో ఐపీఎల్ 2024 రెండో షెడ్యూల్ యూఏఈలో జరుగుతుందన్న వార్తలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆ వేదికను బీసీసీఐ ఎంచుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో వాస్తవాలు లేవని మిగతా మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ దుమాల్ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఐపిఎల్ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు చెప్పలేదని, దాని కోసమే మిగతా మ్యాచ్‌లను కూడా స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇదంతా ధోనీ కోసమే ?
ఈ కొత్త ఈ షెడ్యూల్‌పై వస్తున్న ఊహాగానాలు సరికొత్త ప్రశ్నలను లేపనెత్తుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక ఆటగాడిగా ఉన్న మిస్టర్ కూల్, దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు బీసీసీఐ... ఫైనల్‌ను చెన్నైకి కేటాయించిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దిగ్గజ ఆటగాడు ఎం.ఎస్. ధోనీకి ఘన వీడ్కోలు పలికేందుకే 2024 ఐపీఎల్ ఫైనల్‌ను చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ధోనీ ఇప్పటికే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడని, ధోనీ వయసు 42 దాటుతుండటంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని,. అతనికి ఘన వీడ్కోలు పలికేందుకే ఐపీఎల్ మ్యాచ్‌లను ఫిక్స్ చేసి... చెన్నై జట్టు ఫైనల్ సొంత మైదానంలో ఆడేలా బీసీసీఐ కుట్రలు చేస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్‌కు ముందు తన చివరి మ్యాచ్ చెన్నైలోనే ఉంటుందని ధోనీ చెప్పాడని, దీనిని బట్టి ఐపీఎల్‌ను ఎవరు గెలుస్తారో మీకు తెలుసా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, బీసీసీఐ స్క్రిప్ట్ రాసేసిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఆడకముందే మరో ట్రోఫీ సాధించిన చెన్నైకు శుభాకాంక్షలంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
చెన్నై హోరా, గుజరాత్ జోరా:
ఐపీఎల్(IPL)లో మరో ఆసక్తికర సమరం జరగునుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ సీజన్ 17ను ఘనంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్(CSK) గుజరాత్ టైటాన్స్(GT) అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాలు సాధించిన ఇరు జట్లు ఆ జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఐపీఎల్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని చెన్నై.. గుజరాత్ వ్యూహాలు రచిస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లోనే తన కెప్టెన్సీతో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. ఇటు గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్న గిల్ కూడా తొలి మ్యాచ్‌లో తన నిర్ణయాలతో మెప్పించాడు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. 24 ఏళ్ల గిల్ ఐపీఎల్‌లోనే అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. గిల్‌కు గుజరాత్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా నుంచి మంచి సహకారం లభిస్తోంది.