Dwayne Bravo Comments: ఐపీఎల్లో మూడో అత్యంత విజయవంతమైన జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు హెడ్ కోచ్ గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో సెలెక్టయ్యాడు. తాజాగా కేకేఆర్ జరిపిన మీడియా సమావేశంలో తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఐపీఎల్లోనే అత్యంత విజయవంతమైన జట్లలో కేకేఆర్ ఒకటని, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత మూడు టైటిల్స్ గెలిచిన టీమ్ కేకేఆరేనని గుర్తు చేశాడు. గత సీజన్ లో ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతం గంబీర్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. అతని వారసుడిగా కోచింగ్ బాధ్యత స్వీకరించడం సవాలు లాంటిదేనని పేర్కొన్నాడు. గతేడాది విజయవంతమైన ఫార్ములాలు అమలు చేయడంతోపాటు సొంతంగా తన కొన్ని ప్రణాళికలు అమల్లో పెట్టి, నా స్టైల్లో నడిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. అలా చేయకపోవడం సరికాదని చమత్కరించాడు. ఇక గతేడాది జరిగిన మెగా వేలంలో టీమ్ మేనేజ్మెంట్.. గతేడాది కోర్ టీమ్ ను తిరిగి రూపొందించాలని భావించామని పేర్కొన్నాడు. ఈ క్రమంలో కొంతమంది ప్లేయర్లను తిరిగి తీసుకున్నామని వెల్లడించాడు. ఈక్రమంలోనే రూ.23.75 కోట్లకు ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తర్వాత అత్యంత ఖరీదైన ప్లేయర్ గా వెంకటేశ్ నిలిచాడు. రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ .. పంత్ ను కొనుగోలు చేయగా, రూ.26.75 కోట్లతో శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ ఖరీదు చేసింది. అలాగే లక్నో కెప్టెన్ గా పంత్ , పంజాబ్ కెప్టెన్ గా శ్రేయస్ ను ఆయా యాజమాన్యాలు నియమించాయి.
కేకేఆర్ తో ముందే అనుబంధం..
కేకేఆర్ అధిపతి, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో ముందే తనకు అనుబంధం ఉందని బ్రావో గుర్తు చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు తరపున తను ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేశాడు. సీపీఎల్లో తనను షారూఖ్ ఎంపిక చేయడం ఆనందం కలిగించిందని, ఆ టీమ్ ను చాలా బలోపేతం చేసిన విషయాన్ని పేర్కొన్నాడు. ఆ టోర్నీలో ఆ జట్టే అత్యంత విజయవంతమైనదని తెలిపాడు. షారూఖ్ మంచి బాస్ అని, టీమ్ మేనేజ్మెంట్ తోపాటు సీఈఓ వెంకీ మైసూర్ తోడ్పాటు చాలా బాగా లభిస్తోందని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో చెన్నై తరపున బ్రావో చాలాకాలంపాటు ప్రాతినథ్యం వహించాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్ గా అవతారమెత్తాడు.
తొలిపోరుకు సిద్ధం..
డిఫెండింగ్ చాంపియన్ గా ఐపీఎల్ 2025లో బరిలోకి దిగబోతున్న కేకేఆర్.. తొలి మ్యాచ్ ను సొంతగడ్డపై ఆడబోతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ సీజన్ ఈనెల 22న అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఇక 2024 పైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించిన కేకేఆర్ మూడోసారి కప్పును సొంతం చేసుకుంది. అంతకుముందు 2012, 2014లో గౌతం గంబీర్ నాయకత్వంలో కప్పు గెలిచిన కేకేఆర్.. గతేడాది మాత్రం తన మార్గదర్శకంలో విజేతగా నిలిచింది.