IPL 2025 News: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తాజాగా తన మనసులోని మాట పంచుకున్నాడు. ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ JioHotstarలోని SuperStar సిరీస్‌లో ప్రత్యేకంగా మాట్లాడిన సంజు , 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వడంపై తన విధానాన్ని వివరిస్తూ,
"ఇప్పటి యువ ఆటగాళ్లకు ధైర్యం, స్వీయవిశ్వాసం మెండుగా ఉన్నాయి. వాళ్లు స్థానిక క్రికెట్ పరిస్థితులు, ప్రస్తుత ట్రెండ్స్‌ను బాగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి, వారికి సలహా ఇవ్వడం కంటే, ముందు వాళ్ల ఆటతీరు, ఆలోచనా విధానం, వాళ్లకు అవసరమైన మద్దతు ఏంటో గమనించడమే నాకు ఇష్టం. దాని ప్రకారమే నేను సహాయం చేస్తాను. వైభవ్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అకాడమీలో అతను చాలా పెద్ద సిక్సర్లు కొడుతున్నాడు. అతని పవర్-హిట్టింగ్ గురించి చాలా మంది ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి? అతని బలాలను అర్థం చేసుకోవడం, సహాయంగా ఉండడం, పెద్దన్నలా తోడుగా నిలవడం ముఖ్యం " అని వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ కు సిద్ధం..
సూర్యవంశీ ఇప్పటికి ఐపీఎల్‌కు సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తున్నాడని, ముఖ్యంగా, అతనికి సరైన ఫిట్‌నెస్, మానసిక స్థైర్యం, అనుకూలమైన వాతావరణం కల్పించడం చాలా అవసరమని సంజూ పేర్కొన్నాడు. తమ టీమ్ ఎల్లప్పుడూ ఒక సానుకూలమైన డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని కల్పించే జట్టని, తాము ఆటగాళ్లను పూర్తిగా విశ్వసిస్తామని తెలిపాడు. అతని ఆటతీరు చూస్తే, అతను ఐపీఎల్‌కు రెడీ అని స్పష్టంగా తెలుస్తోందని, అతను మైదానంలో కొన్ని శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడతాడనడం అతిశయోక్తి లేదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైయర్ వంటి కీలక ఆటగాళ్లతో జట్టులో సమతూకం ఏర్పడిందని తెలిపాడు.
బట్లర్ తో సాన్నిహిత్యం..
జోస్ బట్లర్ తనకు అత్యంత సన్నిహితుడైన ఆటగాడని, ఏడు సంవత్సరాలు అతనితో కలిసి ఆడానని సంజూ గుర్తు చేసుకున్నాడు.. తాను కెప్టెన్ అయినప్పుడు, అతను వైస్-కెప్టెన్‌గా అద్భుతమైన మద్దతు ఇచ్చాడని, రిటెన్షన్ పాలసీ వల్ల అతడు జట్టు నుంచి దూరం కావడం బాధకరమని పేర్కొన్నాడు. తనను కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించానని, తనను జట్టు నుంచి కోల్పోవడం జీర్ణించుకోలేక పోయానని తెలిపాడు. రిటెన్షన్, రిలీజ్ విషయాలను తన పరిధిలో ఉంటే మార్చేందుకు ప్రయత్నించేవాడినని పేర్కొన్నాడు. కానీ అది తన చేతుల్లో లేదని నిర్వేదం ప్రకటించాడు.
ఇక భారత మాజీకెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుతూ.. ప్రతి యువ భారత క్రికెటర్‌లా, తానూ ధోనీని ఎప్పటి నుంచో అభిమానించేవాణ్నని, CSKతో ప్రతి మ్యాచ్ ఆడినప్పుడు, అతని దగ్గర కూర్చొని మాట్లాడాలని, అతను ఎలా పనులను మేనేజ్ చేస్తాడో తెలుసుకోవాలని అనుకునేవాణ్ని చెప్పాడు. ఒకసారి షార్జాలో CSKతో జరిగిన మ్యాచ్‌లో మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచానని, అప్పటి నుంచి తమ మధ్య అనుబంధం బలపడిందని చెప్పాడు. ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో తొలి మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ను రాజస్థాన్ ఢీకొనుంది. ఈ మ్యాచ్ ఈనెల 23న హైదరాబాద్ లో జరుగుతుంది.