Rajasthan Royals Coach Rahul Dravid : మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమిస్ లీగ్ (IPL) 2025 ప్రారంభంకానుంది. దీని కోసం అన్ని జట్ల ప్రాక్టీస్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే, ఆ టీం కోచ్ రాహుల్ ద్రవిడ్ పరిస్థితి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసింది.
ఆ వీడియోలో రాహుల్ ద్రవిడ్ రెండు కర్రల సహాయంతో ప్రాక్టీస్ శిబిరానికి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జైపూర్‌లో ప్రాక్టీస్ జరుగుతున్న ప్రాంతానికి రాహుల్ ద్రవిడ్ 2 క్రచెస్‌పై వచ్చారు.
బెంగళూరులో జరిగిన క్లబ్ మ్యాచ్ ఆడుతున్న టైంలో ద్రవిడ్ గాయపడ్డారు. ఎడమ కాలుకు గాయమైనందున చికిత్స తీసుకుంటున్నారు. అందుకే ద్రవిడ్ ఎడమ కాలికి కట్టుతో ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చారు. ఈ వీడియోను పోస్టు చేసిన రాజస్థాన్ రాయల్స్ "బెంగళూరులో క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయం అయిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోలుకుంటున్నారు. ఈరోజు జైపూర్‌లో మాతో చేరారు." అనే పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టింది.
అతని ఎడమ కాలికి గాయమైనప్పటికీ ద్రవిడ్ సెషన్‌లో చురుకుగా పాల్గొన్నారు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లతో మాట్లాడి సూచనలు చేశారు.
రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ శిబిరానికి రాహుల్ ద్రవిడ్ వచ్చిన వీడియోను చూసిన నెటిజన్లు అతని నిబద్ధతను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాహుల్ ద్రవిడ్ 2011 నుంచి 2015 వరకు ఫ్రాంచైజీతో ట్రావెల్ చేశారు. 2014లో రాయల్స్ కోచ్‌గా ఉన్నారు.
ఫిబ్రవరి 22న నాసూర్ మెమోరియల్ షీల్డ్‌లో జరిగిన KSCA గ్రూప్ I, డివిజన్ III లీగ్ మ్యాచ్‌లో చిన్న కుమారుడితో కలిసి ద్రవిడ్ మ్యాచ్ ఆడారు. బెంగళూరులోని SLS గ్రౌండ్‌లో మ్యాచ్ జరిగింది. యంగ్ లయన్స్ క్లబ్‌తో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కుమారుడి అన్వేతో కలిసి బ్యాటింగ్ చేశారు. ఎనిమిది బంతుల్లో 10 పరుగులు చేశారు. తండ్రీకొడుకులు ఐదో వికెట్‌కు 17 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ టోర్నీలోనే సెమీఫైనల్లో ఆడుతున్నప్పుడు గాయపడ్డారు. వచ్చిన రెండో బంతికే గాయమైంది. అయినా ఆట కంటిన్యూ చేసి నాల్గో వికెట్‌కు 66 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ మ్యాచ్‌లో తన టీం ఓడిపోయింది. తర్వాత గాయం తీవ్రం అవ్వడంతో వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం కూడా చికిత్సలోనే ఉన్నారు.