Virat Kohli vs Gautam Gambhir again:  గత ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఆటగాడు నవీన్ ఉల్ హక్, అప్పటి లక్నో మెంటార్ గౌతం గంభీర్‌ మధ్య జరిగిన గొడవ గుర్తుందా... కొన్ని రోజులపాటు ఈ గొడవ క్రికెట్‌ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. సోషల్ మీడియాలలో ఒకరి మీద ఒకరు వారి పేరు పెట్టకుండా కౌంటర్లు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఈ గొడవను మరింత సాగదీశారు.


వాంఖెడే వేదికగా ముంబై - బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాక గంభీర్, నవీన్ ఉల్ హక్‌లు రన్ మిషీన్‌ను మళ్లీ గెలికారు. ముంబైతో మ్యాచ్ లో కోహ్లీని బెహ్రన్‌డార్ఫ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌ను ఫాలో అవుతున్న నవీన్ ఉల్ హక్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో టీవీలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ కనిపించేలా ముందు మామిడిపండ్లను తింటూ.. ‘స్వీట్ మ్యాంగోస్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో నవీన్‌ ఉల్‌ హక్‌ను కోహ్లీ కౌగిలించుకోవడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడింది. కానీ గంభీర్‌తో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆర్సీబీ-కోల్‌కత్తా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగనుండగా... కోల్‌కత్తా మెంటార్‌గా గంభీర్ ఉన్నాడు. మరోసారి వీరిద్దరి మధ్య ఏం జరగనుందనే ఆసక్తి రేగుతోంది. 


దినేశ్‌ కార్తీక్‌ కూడా వెయిటింగ్‌ అట...
ఈ మ్యాచ్‌లో ఎవరి మధ్య యుద్ధం బావుంటుందని అడిగినప్పుడు దినేశ్ కార్తీక్‌ (Dinesh Karthik) సరదాగా స్పందించాడు. ఏ ముగ్గురు మూడు జోడీల మధ్య పోరు బావుంటుందో చెప్పాలంటూ దినేశ్‌ కార్తీక్‌ను కోరారు. విరాట్‌ కోహ్లీ-గౌతం గంభీర్‌ మధ్య పోరు బావుంటుందని వ్యాఖ్యానించాడు. RCB విడుదల చేసిన ఒక వీడియోలో కార్తిక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ కోహ్లీ vs గంభీర్ మధ్య పోరు బాగుంటుందని కార్తిక్‌ అన్నాడు. విరాట్ కోహ్లీ vs గౌతమ్ గంభీర్.. మిచెల్ స్టార్క్ వర్సెస్‌ గ్లెన్ మాక్స్‌వెల్... వరుణ్ చక్రవర్తి వర్సెస్‌ దినేష్ కార్తీక్ మధ్య ఆసక్తికర పోరు జరగనుందని కార్తిక్‌ చెప్పాడు.


అసలు అప్పుడు ఏం జరిగిదంటే.. 
ఐపీఎల్‌ 16 సీజన్‌లో మ్యాచ్‌ ముగియగానే కైల్ మేయర్స్.. కోహ్లీ మాట్లాడుకుంటున్నారు. కోహ్లీతో  మేయర్స్.. ‘నువ్వెందుకు పదే పదే మమ్మల్నిదుర్భాషలాడతావ్‌ అని ప్రశ్నించాడు. అప్పుడు కోహ్లీ.. మరి మీరెందుకు నా వైపు అంత కోపంగా చూస్తున్నారు..?అని ఎదురుప్రశ్న వేశాడు. ఇది జరుగుతుండగానే అక్కడకు గంభీర్ వచ్చి మేయర్స్ ను పక్కకు తీసుకుపోతూ విరాట్‌తో ‘నువ్వు అతడికి ఏం చెప్తున్నావ్?’ అని అడిగాడు. దానికి విరాట్ ‘అసలు మేం మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలోకి ఎందుకొచ్చావ్..?’ అని గుస్సా అయ్యాడు. దాంతో గౌతమ్.. ‘నువ్వు నా ప్లేయర్స్‌ను నిందిస్తున్నావ్. నా ప్లేయర్స్ అంటే నా ఫ్యామిలీ. నువ్వు వాళ్లను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్టే..’అని చెప్పాడు.


గంభీర్ మాటలకు కోహ్లీ కల్పించుకుని.. ‘అయితే నువ్వు నీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో..’ అని అన్నాడు. ఇది గంభీర్‌కు మరింత కోపం తెప్పించింది.. ‘హా.. నీ నుంచే నేర్చుకోవాలి నేను..’ అని గంభీర్ ఎదురుతిరిగాడు.. ఇద్దరిమధ్య వాగ్వాదం పెరుగుతుండటంతో అక్కడే ఉన్న ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి వారిద్దరినీ విడదీశారు.