DC 4th Consecutive Victory: ఈ సీజ‌న్ లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ మరో విజ‌యం సాధించింది. త‌న అన్ బీటెన్ రికార్డును కొన‌సాగిస్తూ, గురువారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై స్ట‌న్నింగ్ విక్ట‌రీ సాధించింది. దీంతో వ‌రుస‌గా నాలుగో విజ‌యంతో పాయింట్ల ప‌ట్టికలో త‌న టాప్-2 స్థానాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంది. బెంగ‌ళూరు చిన్న స్వామి స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 163 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), టిమ్ డేవిడ్ (37) తో టాప్ స్కోర‌ర్లు గా నిలిచారు. బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్, విప్ర‌జ్ నిగ‌మ్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌ను సునాయసంగా ఢిల్లీ పూర్తి చేసింది. 17.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 169 ప‌రుగులు చేసి గెలుపొందింది. సీనియ‌ర్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన ఫిఫ్టీ ( 53 బంతుల్లో 93 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు)తో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. 

Continues below advertisement






కొంప‌ముంచిన చెత్త షాట్లు.. 
బ్యాటింగ్ కు అనుకూల‌మైన చిన్న‌స్వామి స్టేడియం పిచ్ పై ఆర్సీబీ భారీ స్కోరు సాధించ‌లేక‌పోయింది. ఆరంభంలో సాల్ట్ జోరుతో 4 ఓవ‌ర్ల లోప‌లే 61 ప‌రుగులు సాధించింది. ఈ ద‌శ‌లో కోహ్లీ (22)తో స‌మ‌న్వ‌య లోపంతో సాల్ట్ ర‌నౌట‌య్యాడు. దీంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ గాడి త‌ప్పింది. మిగ‌తా బ్యాట‌ర్లు చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. ఇక కోహ్లీతోపాటు కెప్టెన్ ర‌జ‌త్ ప‌తిదార్ (25) త‌మ‌కు ద‌క్కిన శుభారంభాల్ని వినియోగించుకోలేక పోయారు. చివ‌ర్లో టిమ్ డేవిడ్ బ్యాట్ ఝ‌ళిపించ‌డంతో ఆర్సీబీ 160 ప‌రుగుల మార్కును దాటింది. ఈ పిచ్ పై ఇది సాధార‌ణ స్కోరు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.


రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్.. 
ఇక ఈమ్యాచ్ లో సినీయర్ బ్యాట‌ర్ రాహుల్ త‌న విలువేంటో చాటి చెప్పాడు. ప‌వ‌ర్ ప్లేలోనే ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజ‌ర్ (7), అభిషేక్ పోరెల్ (7) వికెట్ల‌ను కోల్పోయి 39/3 తో క‌ష్టాల్లో నిలిచింది. ఈ ద‌శ‌లో రాహుల్ స‌మ‌యోచితంగా బ్యాటింగ్ చేసి ఢిల్లీకి మ‌రో విజయాన్ని అందించాడు.  అంతకుముందు ఆరంభంలో తనకు లభించిన లైఫ్ ను రాహుల్ సద్వినియోగం చేసుకున్నాడు. రజత్ క్యాచ్ వదిలేయడంతో రెచ్చిపోయిన రాహుల్ తనదైన షాట్లతో అలరించాడు. ఆరు సిక్సర్లతో బెంగళూరులో తన ముద్ర చూపించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. మధ్యలో వర్షం పడటంతో గేర్లు మార్చిన రాహుల్.. జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో 22 పరుగులు చేసి మూమెంటం మార్చి వేసి, ఢిల్లీని డ్రైవర్ సీట్ లోకి తీసుకొచ్చాడు.  ముఖ్యంగా కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (15), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (38 నాటౌట్) తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు.