IPL 2025 RCB VS DC Live Updates: రికార్డులు కొల్ల‌గొట్ట‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఐపీఎల్లో మ‌రో మైలురాయిని చేరాడు. ఇప్ప‌టికే ఐపీఎల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా నిలిచిన కోహ్లీ.. గురువారం ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ త‌ర‌పున బ‌రిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో  కోహ్లీ.. వెయ్యి బౌండ‌రీల మార్కును దాటాడు. దీంతో ఈ ఫీట్ న‌మోదు చేసిన తొలి ప్లేయ‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. కోహ్లీ.. ఇప్ప‌టికే కోహ్లీ ఐపీల్లో 257 మ్యాచ్ లాడగా.. 249ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 8వేల‌కుపైగా ప‌రుగులు సాధించాడు. అలాగే 8 సెంచరీలు, 57 అర్థ సెంచ‌రీలు చేశాడు. ఇక 721 బౌండ‌రీలు, 280 సిక్స‌ర్లు త‌న ఖాతాలో ఉన్నాయి. ఓవ‌రాల్ గా ఈ మెగాటోర్నీలో దాదాపు 39 స‌గ‌టుతో 132 స్ట్రైక్ రేట్ తో త‌ను ప‌రుగులు సాధించాడు. 

త‌డ‌బ‌డిన ఆర్సీబీ.. ఇక ఢిల్లీతో జ‌రుగుతున్న ఈ లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ త‌డ‌బ‌డింది. బ్యాటింగ్ కు అనుకూలించిన వికెట్ పై సాధార‌ణ స్కోరుకే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 163 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37, 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్లుగా నిలిచారు. నిజానికి ఆర్సీబీకి వ‌చ్చిన ఆరంభానికి ఈజీగా 230 ప‌రుగుల మార్క‌ను దాటుతుంద‌నిపించింది. తొలి వికెట్ ను 3.5 ఓవ‌ర్ల‌లో 64 ప‌రుగుల వ‌ద్ద కోల్పోయిన ఆర్సీబీ.. వ‌రుస విరామాల్లో వికెట్ల‌ను కోల్పోయి మాములు స్కోరుకే ప‌రిమిత‌మైంది. 

విఫ‌ల‌మైన బ్యాటింగ్.. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ (14 బంతుల్లో 22, 1 ఫోర్, 2 సిక్స‌ర్) అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు. అలాగే వ‌న్ డౌన్ బ్యాట‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (1), లియామ్ లివింగ్ స్ట‌న్ (4), వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేశ్ శ‌ర్మ (3) ఘోరంగా విఫల‌మ‌య్యారు. ర‌జ‌త్ ప‌తిదార్ (25) కీల‌క‌దశ‌లో ఔట్ కావ‌డం కూడా ఆర్సీబీని దెబ్బ తీసింది. అయితే చివ‌ర్లో క్రునాల్ పాండ్యా (18)తో క‌లిసి డేవిడ్ మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పి, స్లాగ్ ఓవర్లో ధాటిగా ఆడి ఆర్సీబీకి స‌వాలు విస‌ర‌గ‌లిగే స్కోరును అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ జ‌ట్టులో స‌మీర్ రిజ్వీ స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ బ‌రిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌల‌ర్లలో విప్ర‌జ్ నిగ‌మ్, కుల్దీప్ యాదవ్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. ఇక ఈ సీజ‌న్ లో వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు నెగ్గిన డీసీ.. అన్ బీటెన్ గా నిలిచింది.