Cricket Fans Flocked To Uppal Stadium: ఐపీఎల్ - 17లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) - చెన్నై (Chennai) మధ్య మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ ఉప్పల్ స్డేడియానికి (Uppal Stadium) అభిమానులు పోటెత్తారు. రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టిక్కెట్లు ఉన్న వారిని ఇప్పటి నుంచే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియంలోని గేట్ నెంబర్ 4 వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టికెట్లు ఉన్నా తమను లోపలికి అనుమతించడం లేదంటూ క్రికెట్ అభిమానులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా బారికేడ్లను తోసేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, క్రికెట్ అభిమానులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు.. టికెట్లు ఉన్న వారందరినీ క్యూలో నిల్చోబెట్టి ఒక్కొక్కరిని లోపలికి అనుమతించారు. అనంతరం వివాదం సద్దుమణిగింది. మరోవైపు, మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై జట్టు అభిమానులతో స్టేడియం అంతా పసుపుమయంగా మారింది.


మెట్రో, బస్ సర్వీసులు


ఉప్పల్ లో హైదరాబాద్ - చెన్నై మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులకు ఇబ్బంది లేకుండా శుక్రవారం రాత్రి గంట పాటు అదనంగా మెట్రో రైళ్లు నడపనున్నారు. అలాగే, ప్రత్యేక ఆర్టీసీ బస్సులను సైతం నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాప్తంగా 24 డిపోల నుంచి మొత్తం 60 బస్సులను నడుపుతామని.. సాయంత్రం నుంచి రాత్రి 11:30 గంటల వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. క్రికెట్ అభిమానులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


కరెంట్ కట్ తో..


కాగా, ఉప్పల్‌లో మొన్న జరిగిన మ్యాచ్‌లో రికార్డుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ హిస్టరీలోనే అత్యధిక పరుగులు రికార్డు బ్రేక్ అయింది. అతి పెద్ద జట్టు అయిన ముంబైపై హైదరాబాద్‌ టీం చరిత్ర తిరగరాయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాంటి టైంలో అదే వేదికపై చెన్నై లాంటి దిగ్గజ జట్టుతో తలపడుతుంది అంటే ఎంతో హైప్ ఉంటుంది. అయితే, కీలక మ్యాచ్ సమయంలో విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పి మ్యాచ్‌కు 24 గంటల ముందు ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపేయడం పెను సంచలనంగా మారింది. అసలు ఏం జరుగుతోందో అన్న చర్చ నడిచింది. అయితే దీనికి విద్యుత్ శాఖ ఓ కారణం చెబుతుంటే... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం వేరే కారణం చెప్పింది. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కొన్ని నెలల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని.. చాలా సార్లు నోటీసులు పంపించినా స్పందించలేదని విద్యుత్ అధికారులు తెలిపారు. అయితే, తమకు టికెట్లు కావాలని విద్యుత్ అధికారులు అడిగారని.. అవి ఇవ్వకపోవడంతోనే ఇలా చేశారని స్టేడియం నిర్వాహకులు ఆరోపించారు. చివరకు హెచ్ సీఏ ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. విద్యుత్ అధికారులతో మాట్లాడి.. స్టేడియానికి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Also Read: Delhi liquor scam case : తీహార్ జైల్లో కవితను ప్రశ్నించనున్న సీబీఐ - అనుమతి ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు !