Ind Vs Aus: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) ముగిసి 10 రోజులు గడిచినా ఇప్పటివరకు బుమ్రా గురించి అక్కడక్కడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఆడం గిల్ క్రిస్ట్ అయితే బుమ్రాను ఆకాశానికి ఎత్తేశాడు. తమ దేశానికే చెందిన లెజెండ్ డాన్ బ్రాడ్మన్.. బుమ్రాను ఎదుర్కొన్నట్లయితే అతని సగటు అంత ఎక్కువగా ఉండేది కాదని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక సగటు కలిగిన ప్లేయర్‌గా బ్రాడ్మన్ రికార్డులకెక్కాడు. 99.96 సగటుతో టాప్‌లో ఉన్నాడు. అతని రికార్డును దశాబ్ధాలు దాటిన ఎవరూ బ్రేక్ చేయలేకపోతున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ని బ్రాడ్మన్‌తో పోల్చేవారు. అలాంటి బ్రాడ్మన్ కూడా బుమ్రా బౌలింగ్‌కు తడబాటుకు గురయ్యేవాడని గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. 

Continues below advertisement


పాస్ మార్కులే..
గతేడాది కాలంగా వివిధ రికార్డులను బద్దలు చేస్తూ బుమ్రా ప్రయాణం చేస్తున్నాడు. గతేడాది 86 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరిన భారత పేసర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే అత్యంత తక్కువ సగటుతో ఈ మైలురాయి చేరుకున్న పేసర్‌గా నిలిచాడు. ఇక బీజీటీలో అయితే వన్ మేన్‌షో చూపించాడు. మొత్తం 32 వికెట్లు తీసి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు బీజీటీలో అత్యధిక వికెట్లు తీసిన హర్భజన్ సింగ్ (2001) రికార్డును సమం చేశాడు. అలాగే ఆసీస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇక ఐపీఎల్లోనూ తన జోరు చూపించాడు. ప్లే ఆఫ్స్‌కు వెళ్లడంలో ముంబై విఫలమైనా, 20 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఇలా ఏడాదంతా తన వన్ మేన్ షో చూపించాడు. అలాంటి బుమ్రాను గిల్ క్రిస్ట్‌తో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కొనియాడాడు. ఫర్ఫెక్ట్ 10/10 రేటింగ్ బుమ్రాకు ఇస్తానని పేర్కొన్నాడు. ఇక బ్రాడ్మన్ బుమ్రాను ఎదుర్కొన్నట్లయితే తనకు పాస్ మార్కులే వచ్చేవని గిల్ క్రిస్ట్ చమత్కరించాడు. 


గాయపడిన బుమ్రా.. 
ఇక ఆసీస్ టూర్లోనే బుమ్రా గాయపడ్డాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో ప్రస్తుతం ఎన్సీఏలో పునరావాసంలో ఉన్నాడు. దీంతో వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లకు తను అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. తన గాయాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తు బీసీసీఐ, తన కోసమే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించకుండా ఆపింది. ఈ నెల 18, 19 తేదీల్లో జట్టును ప్రకటించే అవకాశముంది. తను ఫిట్‌గా మారితే మెగా టోర్నీకి పంపించాలని బోర్డు భావిస్తోంది. ఇందుకోసం తన చికిత్సకు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ ఆర్థో పెడిక్ సర్జన్‌ను కూడా రప్పిస్తోంది. మరోవైపు బుమ్రా మెగాటోర్నీ వరకల్లా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తను అందుబాటులోకి వస్తే ఛాంపియన్స్ ట్రోపీ కరువు భారత్‌కు తీరుతుందని పేర్కొంటున్నారు. చివరిసారిగా 2013లో ఇంగ్లాండ్‌పై నెగ్గి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2017లో ఫైనల్ చేరినా, పాక్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. వచ్చే నెలలో మెగా టోర్నీ ప్రారంభమవుతోంది. 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగనున్న ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగతాయి. 


Also Read: Bumrah Vs BCCI: ఇదేం వాడకం బాబోయ్.. బుమ్రా గాయానికి కారణం బీసీసీనే! మెగాటోర్నీ ముందు ఇలా చేస్తారా అని ఫ్యాన్స్ ఫైర్