Mohammad Amir IPL 2024: పాకిస్తాన్ మాజీ  పేసర్ మహ్మద్ అమీర్ గుర్తున్నాడా..? 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ లను ఔట్ చేసి భారత ఓటమిని శాసించింది అతడే.. ఈ  పాకిస్తానీ  పేసర్ ఇండియన్  ప్రీమియర్ లీగ్ - 2024 సీజన్ లో ఆడనున్నాడా..?  ఆ మేరకు  అస్త్రాలన్నింటినీ  సిద్ధం చేసుకుంటున్నాడా..?  అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అదేంటి, పాకిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడేందుకు ఛాన్స్ లేదు కదా.. అలాంటిది  అమీర్, ఐపీఎల్ ఎలా ఆడుతాడనేగా మీ డౌటానుమానం..? అక్కడికే వస్తున్నాం.  అమీర్ ఆడేది  పాక్ క్రికెటర్ గా కాదు. ఇంగ్లాండ్  దేశస్తుడిగా...!


అదెలా..? 


2010లో పాకిస్తాన్  ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ ఘటన (అమీర్ కూడా ఇందులో  ఉన్నాడు) తర్వాత 2015లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత  అమీర్.. 2016లో నజ్రీస్ ఖాటూన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె పూర్వీకులు పాకిస్తాన్ నుంచి బ్రిటన్ కు వలస వెళ్లారు.  నజ్రీస్ కు అక్కడి పౌరసత్వం కూడా ఉంది.  అమీర్ - నజ్రీస్ లకు ఇద్దరు కూతుళ్లు.  పాకిస్తాన్ క్రికెట్ లో  2020లో  సెలక్టర్లతో  గొడవపడి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ తో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటివాటిలో ఆడుతున్నాడు. 


 






కొద్దిరోజుల క్రితమే అతడు బ్రిటన్ పౌరసత్వానికి అప్లై చేశాడు.  రాబోయే రెండు మూడు నెలల్లో అతడికి బ్రిటన్  సిటిజన్ షిప్  దక్కే అవకాశం ఉంది.  బ్రిటన్  పౌరసత్వం దక్కితే అతడు ఇంగ్లాండ్ దేశస్తుడైపోతాడు. అప్పుడు ఐపీఎల్ ఆడేందుకు వీలవుతుంది. గతంలో పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అజార్ మహ్ముద్.. 2008లో ఇంగ్లాండ్ పౌరసత్వం పొందే  ఐపీఎల్ ఆడాడు.


అమీర్ ఏం చెప్పాడు..? 


ఐపీఎల్ లో ఆడటంపై అమీర్ పాకిస్తాన్ ఛానెల్ అరీ న్యూస్ తో మాట్లాడుతూ..‘నేను రెండు విషయాలు క్లీయర్ గా చెప్పాలనుకుంటున్నా.. మొదటిది  నేను ఇంగ్లాండ్ తరఫున ఆడాను. నేను పాకిస్తాన్ తరఫున ఆడాను.   రెండోది.. ఐపీఎల్ లో నేను ఆడతానో లేదో ఇప్పుడే చెప్పలేను. అప్పటివరకు పరిస్థితులు ఎలా ఉంటాయో.. రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఐపీఎల్ తర్వాతి సీజన్ కు ఇంకా సుమారు పది నెలల టైమ్ ఉంది. నేను ఏదైనా క్రమక్రమంగా చేసుకుపోవాలని చూస్తున్నాను. ఏడాది తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.  నాకు పాస్ పోర్ట్ వచ్చిన తర్వాత మంచి అవకాశం ఏదొస్తే  దాన్లో నా బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. దానికోసం నేను వెయిట్ చేస్తున్నా..’ అని చెప్పాడు. 


2009లో పాకిస్తాన్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. ఆనతికాలంలోనే  గుర్తింపు దక్కించుకున్నాడు. తనదైన స్వింగ్  బౌలింగ్ తో   ప్రపంచ దిగ్గజ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. పాకిస్తాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడిన అమీర్.. టెస్టులలో 119, వన్డేలలో 81, టీ20లలో 59 వికెట్లు పడగొట్టాడు. 









Join Us on Telegram: https://t.me/abpdesamofficial