CSK Special Camp at Chepauk Stadium: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇప్పటి నుంచే IPL 2023 కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తమ సొంత మైదానం చెపాక్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాన్ని ఫిబ్రవరి మార్చి మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది.
మూడేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్‌లో అడుగుపెట్టనుంది. వాస్తవానికి గత మూడు సీజన్‌లుగా కరోనా మహమ్మారి కారణంగా, ఫ్రాంచైజీలకు వారి సొంత మైదానంలో ఆడే అవకాశం లభించలేదు. కానీ ఇప్పుడు కరోనా భయం దాదాపుగా ముగిసింది. ఐపీఎల్ మరోసారి దాని పాత ఫార్మాట్ (హోమ్ అండ్ ఎవే మ్యాచ్‌లు)కి తిరిగి వస్తుంది. అటువంటి పరిస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు తమ ఆటగాళ్లకు వారి సొంత గ్రౌండ్ అనుభవాన్ని అందించాలని కోరుకుంటుంది.
చెన్నై సూపర్ కింగ్స్ అధికారు ఒకరు మాట్లాడుతూ 'తేదీ ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ శిబిరం ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభంలో ప్రారంభం అవుతుంది. రెండు వారాల నుంచి ఒక నెల వరకు నిర్వహించనున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నైలోని పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని సీఎస్‌కే ఆటగాళ్లు మారాలని ధోనీ, ఫ్లెమింగ్‌లు కోరుతున్నారు.' అన్నారు.
చెన్నైలోని చెపాక్ స్టేడియం పిచ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు విభిన్న సవాళ్లను అందిస్తుంది. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై తన సగం మ్యాచ్‌లను ఈ మైదానంలో ఆడవలసి ఉంది. దాని స్వంత మైదానంలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి సాధ్యమైనదంతా చేస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులో జరిగే ఈ శిబిరం చెన్నై ఆటగాళ్లకు చెపాక్ పిచ్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడడమే కాకుండా, యువ ఆటగాళ్లలో నైపుణ్యాలు, మెళుకువలను మెరుగుపరిచేందుకు కూడా దోహదం కానుంది.