Wrong UPI Payment: మన దేశంలో, డిజిటల్ పద్ధతిలో చేసే చెల్లింపుల్లో (Digital payments) వేగవంతమైన ట్రెండ్ కనిపిస్తోంది. 2022 డిసెంబర్‌లో, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (Unified Payments Interface) లేదా UPI ఆధారితంగా జరిపిన చెల్లింపుల విలువ రూ. 12.82 లక్షల కోట్లకు చేరింది. ఇది రికార్డు స్థాయి. ఆ నెలలో దేశ ప్రజలు జరిపిన UPI లావాదేవీల సంఖ్య 782 కోట్ల పైమాటే.


గత ఏడాది కాలంగా, దేశంలో UPI లావాదేవీల సంఖ్య & వాటి విలువ చాలా వేగంగా పెరుగుతూ వస్తోంది. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో అయినా, చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌ ద్వారా తక్షణం చెల్లింపు చేయగలగడం ఈ పద్ధతిలో ఉన్న అత్యంత అనుకూల లక్షణం. దీని కోసం ప్రత్యేకంగా ప్రొఫైల్‌ను సృష్టించాల్సిన అవసరం లేదు. అవతలి వ్యక్తి UPI ఐడీ, ఫోన్‌ నంబర్‌, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌.. ఇలా ఏది ఉన్నా డబ్బు సులభంగా పంపించవచ్చు. 


UPIలో చాలా సానుకూల అంశాలు ఉన్నా, చిన్నపాటి ఇబ్బంది కూడా ఉంది. మీరు ఏదైనా ఫోన్‌ నంబర్‌కు డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు, 10 అంకెల్లో ఒక్క అంకెను తప్పుగా ఎంటర్‌ చేసినా డబ్బులు వేరొకరికి వెళ్లిపోతాయి. లేదా, యూపీఐ ఐడీలో ఒక్క అక్షరం మారినా ఇదే జరుగుతుంది. ఒక్కోసారి హడావిడిగా పేమెంట్‌ చేసేటప్పుడు ఇలాంటి పొరపాటు దొర్లడానికి అవకాశం ఉంటుంది. మీ డబ్బు పొరపాటున వేరొకరికి వెళ్లిపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం ఇకపై లేదు. మీ డబ్బును మీరు తిరిగి పొందే అవకాశం ఉంది.


డబ్బును తిరిగి పొందడం ఇలా:
ఒకవేళ మీరు పొరపాటును వేరొకరికి డబ్బులు పంపితే... డబ్బు బదిలీ తర్వాత దాని తాలూకు స్క్రీన్‌ షాట్‌ తీసి పెట్టుకోండి. మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయినట్లు మీకు సందేశం వస్తుంది కదా, దాన్ని కూడా జాగ్రత్తగా దాచండి. ఇప్పుడు యాక్షన్‌ పార్ట్‌ మొదలవుతుంది. ముందుగా, మీరు ఏ యాప్‌ (పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటివి) ద్వారా డబ్బు అవతలి వ్యక్తికి పంపిచారో, సంబంధిత కస్టమర్‌ సర్వీస్‌కు ఫోన్‌ చేసి, లేదా ఈ-మెయిల్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించండి. మీ సమస్య పరిష్కారం కావడానికి ఇక్కడ 50-50 ఛాన్స్‌ ఉంది.


ఒకవేళ సదరు కస్టమర్‌ సర్వీసు వాళ్లు కూడా చేతులెత్తేస్తే, మీరు NPCI పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ npci.org.inలోకి వెళ్లి..'What we do' ట్యాబ్‌లో UPI బటన్‌ మీద క్లిక్‌ చేయండి. ఆ తర్వాత, కంప్లయింట్ సెక్షన్‌లో ఫిర్యాదు చేయండి. వచ్చు. నేరుగా ఈ లింక్‌ను క్లిక్‌ చేసి ఫిర్యాదుల పేజీకి వెళ్లవచ్చు.


వీటితోపాటు, మీ బ్యాంకుకు కూడా జరిగిన విషయాన్ని వివరించండి. ముందుగా మీ బ్యాంకుకు - ఆ తర్వాత, అవతలి వ్యక్తి ఖాతా ఉన్న బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. ఆ బ్యాంకు వాళ్లు సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపసు చేయించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలు ఏమీ ఫలించకపోతే, bankingombudsman.rbi.org.in వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడి నుంచి కూడా ఫిర్యాదు చేయవచ్చు. 


చివరి అస్త్రంగా మీరు కోర్టుకు వెళ్లవచ్చు. మీ అకౌంట్‌ నుంచి వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు అవతలి వ్యక్తి నిరాకరించినట్లయితే.. అతని మీద లీగల్‌గా కూడా యాక్షన్  తీసుకునే అవకాశం ఉంది.


ఇన్ని తిప్పలు ఎందుకు అనుకుంటే... డబ్బు పంపే ముందే ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటే సరి, ఆల్‌ హ్యాపీస్‌.