సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి నవ్వింది! రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఉత్కంఠకర విజయం అందుకుంది. 142 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. 4 పరుగుల తేడాతో గెలిచింది. సన్‌రైజర్స్‌లో జేసన్‌ రాయ్‌ (44; 38 బంతుల్లో 5x4), విలియమ్సన్‌ (31; 29 బంతుల్లో 5x4) రాణించారు. కోహ్లీసేనలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (40; 25 బంతుల్లో 3x4, 2x6), దేవదత్‌ పడిక్కల్‌ (41; 52 బంతుల్లో 4x4) పోరాడారు. ఆఖరి ఓవర్లో భువీ 13 పరుగులను రక్షించాడు.


Also Read: రాజస్తాన్‌ను చితక్కొట్టిన ఇషాన్ కిషన్.. 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్! 


మాక్సీ ఔటవ్వడంతోనే..


ఛేదనలో బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌ ఆఖరి బంతికి విరాట్‌ కోహ్లీ (5) ఎల్బీ అయ్యాడు. మరికాసేపటికే డాన్‌ క్రిస్టియన్‌ (1) పెవిలియన్‌ చేరాడు. దాంతో పవర్‌ప్లేలో కేవలం 37 పరుగులే వచ్చాయి. ఓ సిక్సర్‌ బాదిన శ్రీకర్ భరత్‌ (12)ను జట్టు స్కోరు 38 వద్ద మాలిక్‌ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో మాక్సీ, పడిక్కల్‌ నాలుగో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టును విజయం వైపు నడిపించారు. రషీద్‌ బౌలింగ్‌లో మాక్సీ కళ్లుచెదిరే షాట్లు ఆడాడు. కీలక సమయంలో సమన్వయ లోపంతో జట్టు స్కోరు 92 వద్ద మాక్సీ రనౌట్‌ అయ్యాడు. మరికాసేపటికే పడిక్కల్‌ను రషీద్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 109/5. ఆర్‌సీబీ 18 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన సమయంలో షాబాజ్‌ అహ్మద్‌ (14) రెండు బౌండరీలు బాదడంతో ఆఖరి ఓవర్లో 13 చేయాల్సి వచ్చింది. ఏబీడీ (19) ఓ సిక్సర్‌ బాదినా భువీ 8 పరుగులే ఇవ్వడంతో బెంగళూరు ఓటమి పాలైంది.


Also Read: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు శామ్ కరన్ దూరం.. కారణం ఏంటంటే? 


రక్షించిన కేన్‌, రాయ్‌
మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఈ సారి జేసన్‌ రాయ్‌తో అభిషేక్‌ శర్మ (13)ను ఓపెనింగ్‌కు పంపింది. అతడు భారీ షాట్లు ఆడే క్రమంలో జట్టు స్కోరు 14 వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో కేన్‌ విలియమ్సన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చక్కని షాట్లతో అలరించాడు. మరోవైపు రాయ్‌ సైతం జోరు పెంచాడు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికే స్కోరు 50 దాటింది. దూకుడుగా ఆడుతూ రెండో వికెట్‌కు 58 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని.. కేన్‌ను ఔట్‌ చేయడం ద్వారా హర్షల్‌ పటేల్‌ విడదీశాడు. ఐతే రాయ్‌ అర్ధశతకానికి చేరువ కావడంతో హైదరాబాద్‌ 13.1 ఓవర్లకు 100 పరుగుల మైలురాయి అందుకుంది. ఆ తర్వాత హర్షల్‌ పటేల్‌(3/33), డాన్‌ క్రిస్టియన్‌ (2/14) వికెట్లు తీయడంతో హైదరాబాద్‌ పతనం మొదలైంది. చాహల్‌, అహ్మద్‌ పరుగుల్ని నియంత్రించారు. ఫలితంగా హైదరాబాద్‌ 141/7కు పరిమితమైంది.


Also Read: భారత్‌ x పాక్‌.. గంటల్లోనే టికెట్లన్నీ కల్లాస్‌..! వేలల్లో పలికిన ధర!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి