తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు దేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడలోని జిల్లా టీడీపీ ఆఫీసును వైఎస్సార్ సీపీ శ్రేణులు, మత్స్యకారులు ముట్టడించే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు  కొండబాబు, నవీన్ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా వైసీపీ నేతలు, మత్స్యకారులు ఒక్కసారిగా దాడికి దిగారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ద్వారంపూడి మద్దతుదారులు, మత్స్యకారులు, బోటు నిర్వాహకులు టీడీపీ నేతలపై దాడి చేశారని నేతలు ఆరోపించారు.


ఇటీవల అగ్నిప్రమాదం సంభవించి బోటు కాలిపోయిన బోటులో హెరాయిన్  ఉందని పట్టాభి ఆరోపించడం వివాదానికి కారణమైంది. మాజీ మంత్రి చినరాజప్ప, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డ్రగ్స్ దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. డ్రగ్స్ దిగుమతి చేస్తున్న క్రమంలోనే బోటు దగ్ధమైందని పట్టాభిరామ్ ఆరోపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం పూర్తి స్తాయిలో విచారణ చేపట్టలేదని, రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. 


Also Read: "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం ! 


హెరాయిన్‌తో బోటు ప్రమాదానికి లింక్..
బోటులో జరిగిన అగ్రిప్రమాదాన్ని డ్రగ్స్ అక్రమ రవాణాకు ముడిపెడుతూ పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు. అయితే బోట్ ప్రమాదాన్ని హెరాయిన్ స్మగ్లింగ్‌తో ముడి పెట్టడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాకినాడ పోర్టులో టీడీపీ నేతల టీమ్ పర్యటించి తూర్పు గోదావరి జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, మత్స్యకారులు జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టాభిరామ్ సహా టీడీపీ నేతలు పార్టీ ఆఫీసు నుంచి బయటకు రావాలని డిమాండ్ చేస్తూ పెద్దగా నినాదాలు చేశారు. జ్యోతుల నవీన్, కొండబాబు పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా వారిపై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు, బోటు నిర్వాహకులు దాడికి యత్నించారు.


Also Read: ఇంటి నుంచే సంపాదన పేరుతో మోసం.. రూ.11 కోట్లు స్వాహా.. ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు..


జ్యోతుల నెహ్రూ జోక్యంతో సద్దుమణిగిన వివాదం..


వైఎస్సార్ సీపీ శ్రేణులు, బోటు నిర్వాహకుల దాడితో అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు కొండబాబు, నవీన్‌ను పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్లారు. మరోవైపు పట్టాభిరామ్ మాత్రం బయటకు రాకుండా ఆఫీసులో ఉండిపోయారు. తమకు డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాతో సంబంధం అంటకట్టిన పట్టాభిరామ్ పై బోటు నిర్వాహకులు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్ ప్రమాదంపై పట్టాభి  వ్యాఖ్యలు తప్పుగా భావిస్తే వాటిని ఉపసంహిరంచుకుంటున్నామని  నిమ్మకాయల చినరాజప్ప సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పట్టాభి తమకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ వారు ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసుల రక్షణ కల్పించి పట్టాభిరామ్‌ను ఎస్కార్ట్‌తో సురక్షితంగా ఇంటికి తరలించారు.


Also Read: స్పెషలైజేషన్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టండి.. స్థానికంగానే వైద్య సేవలు అందించాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి