ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థుల సిలబస్ నుంచి హఠాత్తుగా అమరావతి పాఠాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ సరఫరా చేసింది. 2014 నుంచి ఒకే రకమైన పుస్తకాలు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది కూడా వాటినే ముద్రించారు. అయితే పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా "అమరావతి" ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. గుట్టుగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. పంపిణీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయం అధికారికంగా బయటకు తెలియలేదు. పుస్తకాలు అందరికీ సరఫరా చేసిన తర్వాతే గుర్తించారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నదానిపై విద్యా శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రాజకీయ విమర్శలు మాత్రం ప్రభుత్వంపై ప్రారంభమయ్యాయి. అమరావతిపై కక్షతోనే ప్రభుత్వం ఈ పాఠాన్ని తొలగించిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి అనే పదంపై రాష్ట్రప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. నేరుగా ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించటం దుర్మార్గమని లేఖలో విమర్శించారు.
Also Read: జగన్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ ..ఎందాకైనా వెళ్తానన్న రఘురామ..!
తెలుగు పాఠ్య పుస్తకంలో అమరావతి పాఠాన్ని తొలగించి, మిగిలిన 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించడం విచారకరమని ... దాదాపు 20 శతాబ్ధాల ఘనచరిత్ర కలిగిన ప్రాంతంగా ఉన్న అమరావతి నేపథ్యాన్ని భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన లేఖలో స్పష్టం చేశారు. పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో అమరావతి పాఠాన్ని తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇదే తరహా విమర్శలు చేస్తున్నాయి. అమరావతి పై వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ
అయితే విద్యా సంవత్సరం కొనసాగుతున్న సమయంలో ఈ మార్పు గురించి బయటకు రావడం విద్యార్థుల్ని, టీచర్లను కూడా ఇబ్బంది పెడుతోంది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ సూచించింది. అయితే పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన "అమరావతి"ని ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తోంది. విపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Also Read: తప్పయింది.. ఇక ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయం ! హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రమాణపత్రం !