ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఏ ప్రభుత్వ భవనానికి పార్టీ రంగులు వేయబోమని ఏపీ సర్కార్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. "చెత్త నుండి సంపద తయారీ" కేంద్రాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణలోనే హైకోర్టు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగులు తొలగించాలని ఆదేశించింది. రెండు వారాల్లో రంగులు తొలగిస్తామని అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయకండా కిందిస్థాయి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
అక్టోబర్ 6 లోగా రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుమంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు తొలగించామని.. భవిష్యత్‍లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ హైకోర్టులో ప్రమాణపత్రాన్ని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భవనాలకు రంగుల వివాదం గత రెండేళ్లుగా ఉంది.
Also Read : నిధులపై కేంద్రం - రాష్ట్రం టగ్ ఆఫ్ వార్ ! పోలవరం కల సాకారం ఎప్పటికి ?
గతంలో పంచాయతీ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పట్లో హైకోర్టు విచారణ జరిపి రంగులు తీసేయాలని ఆదేశించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. కార్యాలయాలు ప్రభుత్వానివి కాబట్టి పార్టీ రంగులు ఉండకూడదని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. పలు చోట్ల ప్రభుత్వ అధికారులే అధికారిక ఆదేశాలు ఇచ్చి రంగులు వేయించారు. కొన్ని కోట్ల మౌఖిక ఆదేశాలతో రంగులు వేయించారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా రంగులు తీసేయాలని తేల్చి చెప్పడంతో తొలగించారు.
అయితే పంచాయతీ భవనాలకు కాకుండా ఇతర ప్రభుత్వ ఆస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు వాటిని కూడా తొలగిస్తామని.. ఇక భవిష్యత్‌లో వేయబోమని ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఈ కారణంగా ఈ రంగుల వివాదం ఇంతటితో ముగిసిపోతుందని అంచనా వేస్తున్నారు.
Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?