ఐపీఎల్‌లో నేడు రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 90 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇషాన్ కిషన్ (50 నాటౌట్: 25  బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు)  చెలరేగడంతో 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నెట్ రన్‌రేట్‌ను కూడా భారీగా మెరుగుపరుచుకుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయింది.


ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు
ఇన్నింగ్స్ మొదటి నుంచే ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (22: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (50 నాటౌట్: 25  బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) నెట్ రన్‌రేట్ దృష్టిలో పెట్టుకుని ఆడారు. మొదటి బంతి నుంచే అటాకింగ్ చేశారు. ఈ ప్రయత్నంలోనే రోహిత్ అవుటయ్యాడు. అయినప్పటికీ వేగం తగ్గలేదు. వచ్చీ రాగానే మూడు ఫోర్లు కొట్టిన సూర్యకుమార్ (13: 8  బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా వెంటనే అవుటయ్యాడు. ఈ దశలో ఇషాన్ కిషన్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. చేతన్ సకారియా వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో 24 పరుగులు రాబట్టిన కిషన్, తర్వాత ముస్తాఫిజుర్ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టి 8.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. ఈ క్రమంలోనే తన అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. రాజస్తాన్ బౌలర్లలో సకారియా, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.


Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!


ముంబై బౌలింగ్ అదుర్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ అత్యంత పేలవంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (24: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), జైస్వాల్ (12: 9 బంతుల్లో, మూడు ఫోర్లు) పవర్‌ప్లేలోనే అవుటయ్యారు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రెండు వికెట్లు నష్టపోయి 41 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా సంజు శామ్సన్ (3: 6 బంతుల్లో), శివం దూబే (3: 8 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ (4: 13 బంతుల్లో) వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో రాజస్తాన్ పది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులకు మాత్రమే చేయగలిగింది.


ఆ తర్వాత కూడా ఇన్నింగ్స్ నత్త నడకన సాగింది. ముంబై బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో రాజస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ మిల్లర్ (15: 23 బంతుల్లో) కూడా భారీ షాట్లు కొట్టలేకపోయాడు. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైట్ నాలుగు వికెట్లు తీయగా, జిమ్మీ నీషం మూడు వికెట్లు,  బుమ్రా రెండు వికెట్లు తీశారు. జయంత్ యాదవ్ తప్ప ముంబై బౌలర్లందరి ఎకానమీ రేటు ఆరులోపే ఉండటం విశేషం. గత మ్యాచ్‌లో చెన్నైపై 17.3 ఓవర్లలో 190 పరుగులు ఛేదించిన జట్టు ఇదేనా అనిపించేలా రాజస్తాన్ బ్యాటింగ్ ఉంది.


Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి