ఐపీఎల్‌ రెండో దశ ఆరంభ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లేకుండానే బరిలోకి దిగింది. అతడితో పాటు హార్దిక్ పాండ్య సైతం దూరమయ్యాడు. యువ ఆటగాడు అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మ్యాచులో అరంగేట్రం చేయనున్నాడు.


ఆరంభ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. రోహిత్‌ వర్సెస్‌ ధోనీ పోరాటాన్ని వీక్షించాలని ఆశించారు. కానీ అతడు పిక్క కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలిసింది. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో అతడు ఫీల్డింగ్‌ చేయని సంగతి తెలిసిందే. అతడు ఈ మధ్యే లండన్‌ నుంచి దుబాయ్‌కు వచ్చాడు.  స్వల్పంగానే కసరత్తులు, సాధన చేశాడు. భవిష్యత్తు మ్యాచులను దృష్టిలో పెట్టుకొని రోహిత్‌కు విశ్రాంతినిచ్చారు. 


Also Read: CSK vs MI: పంతం నీకా నాకా హై..! చివరి 5లో 4 ముంబయివే.. రోహిత్‌, ధోనీలో నేడు గెలిచేదెవరు?


రోహిత్‌ లేనప్పటికీ ముంబయికి నాయకత్వ కొరతేమీ లేదు. అత్యంత సీనియర్‌ ఆటగాడైన పొలార్డ్‌కు కెప్టెన్‌గా విశేష అనుభవం ఉంది. వెస్టిండీస్‌ జట్టుకు అతడు కెప్టెన్‌గా పనిచేశాడు. కరీబియన్‌ లీగ్‌లో అతడు నైట్‌రైడర్స్‌ జట్టుకు గతేడాది ఏకంగా టైటిల్‌ అందించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ గతంలో కెప్టెన్సీ చేసి గెలిపించాడు. బౌలర్లను మార్చడం, ఫీల్డర్లను మోహరించడం, అవసరమైన వ్యూహాలు అమలు చేయడంలో అతడు నేర్పరి.


Also Read: Ravi Shastri on T20 Cricket: లీగ్‌ క్రికెట్‌ ఆడించడమే మంచిది.. బుమ్రా అరంగేట్రం రహస్యం చెప్పిన రవిశాస్త్రి


హార్దిక్‌ పాండ్య సైతం ఫిట్‌నెస్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిసింది. కాగా యువ ఆటగాడు అన్మోల్‌ప్రీత్‌ ఈ మ్యాచులో అరంగేట్రం చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో అతడు మెరుపులు మెరిపించాడు. ముంబయి మ్యాచుల్లో అవసరమైన ప్రతిసారీ అతడు ఫీల్డింగ్‌ చేసి అదరగొట్టేవాడు. గతేడాది సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వచ్చి అద్భుతమైన క్యాచులు అందుకున్నాడు.


Also Read: IPL 2021 Phase 2: 'పిక్చర్‌ అభీ బాకీ హై'.. సవాళ్లు విసురుకున్న కోహ్లీ, రోహిత్‌!


చెన్నైపై ముంబయిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 31 మ్యాచులు ఆడగా రోహిత్‌సేన 19, ధోనీసేన 12 గెలిచింది. ఇక ఈ మధ్య ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో  ముంబయి ఏకంగా నాలుగు గెలిచింది. ఈ సీజన్‌ చివరి మ్యాచుల్లో ప్రత్యర్థి  నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఆఖరి బంతికి ఛేదించింది. పొలార్డ్‌ కేవలం 34 బంతుల్లోనే 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.