IPL-2021 రెండో సీజన్ సందడి మొదలైంది. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్... చెన్నై నుంచి UAE బయల్దేరింది. ఆటగాళ్లు యూఏఈ బయల్దేరే ముందు ఫొటోలను ఆ ఫ్రాంఛైజీ జట్టు ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 






కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది IPL మధ్యలోనే అర్థంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో UAEలో మిగతా సీజన్ నిర్వహించాలని BCCI నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అన్ని జట్ల కంటే ముందే యూఏఈ బయల్దేరింది. ముంబయి ఇండియన్స్Xచెన్నై సూపర్ కింగ్స్ మధ్య సెప్టెంబరు 19న మ్యాచ్‌తో సీజన్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ యూఏఈ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 







ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. నాలుగు రోజుల క్రితమే ధోనీ రాంచీ నుంచి చెన్నై చేరుకున్నాడు. అలాగే భారత్‌లో ఉన్న ఆ జట్టు ఆటగాళ్లు అందరూ చెన్నై చేరుకున్నారు. శుక్రవారం చెన్నై నుంచి UAE బయల్దేరారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆటగాళ్ల ఫొటోలను ట్విటర్ ద్వారా పంచుకుంది. దీంతో ధోనీ అభిమానులు ఊరుకుంటారా? వెంటనే ఆ ఫొటోలను కాస్త వైరల్ చేసేశారు. ఈ ఫొటోల్లో ధోనీతో పాటు సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ తదితరులు ఉన్నారు.