ఇన్ని రోజులు మనల్ని ఎంతగానో అలరించి, ఆనందాన్ని అందించి, థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో దాదాపు హార్ట్ఎటాక్‌ను కూడా తెప్పించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది. టోర్నీ మొదటి నుంచి డామినేటింగ్ గేమ్‌తో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్, యూఏఈ వచ్చాక రూట్ మార్చి విజయాల బాట పట్టిన కోల్‌కతాతో తలపడనుంది. లీగ్ దశలో టాపర్‌గా నిలిచిన ఢిల్లీ అనూహ్యంగా రెండు ఓటములతో టోర్నీ నుంచి తప్పుకుంది.
ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్ ఎవరు అంటే చెప్పడం కొంచెం కష్టమే. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుఫ్లెసిస్ తిరుగులేని ఫాంలో ఉన్నారు. అప్పుడప్పుడు డుఫ్లెసిస్ విఫలం అయినా.. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం కనీసం 10 ఓవర్ల పాటు క్రీజులో నిలబడిపోతున్నాడు. అలాగని నిదానంగా కూడా ఆడటం లేదు. అతని స్ట్రైక్ రేట్ 140 వరకు ఉంది. ఇక వారిద్దరి తర్వాత మొయిన్ అలీ, రాయుడు, ఊతప్ప కూడా మంచి టచ్‌లో ఉన్నారు. క్వాలిఫయర్ మ్యాచ్‌లో ధోని టచ్‌లోకి రావడం కూడా చెన్నైకి కలిసొచ్చే అంశం. జడేజా, బ్రేవో, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లకు కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. మొత్తం బ్యాటింగ్ లైనప్‌లో ముగ్గురు లేదా నలుగురు స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేసినా.. చెన్నై ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేయడం ఖాయం.
Also Read: ఓటమితో గుండె పగిలిన రిషభ్ పంత్.. కన్నీరు పెట్టుకున్న పృథ్వీ షా! చూసిన వాళ్లూ బాధపడ్డారు
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. గొప్ప పేరున్న బౌలర్లు ఎవరూ చెన్నైలో లేరు. కానీ ఉన్న బౌలర్లు మాత్రం విశేషంగా రాణిస్తున్నారు. దీపక్ చాహర్, శార్దూల్, జడేజా, బ్రేవో, మొయిన్ అలీ.. ఇలా ఎవరి చేతికి బంతిని ఇచ్చినా వారు వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. ఇక మొయిన్ అలీ, జడేజా మిడిల్ ఓవర్లలో పరుగులు కూడా కట్టడి చేస్తున్నారు. స్లాగ్ ఓవర్లలో బ్రేవో కూడా అద్భుతంగా చేస్తున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లు మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో స్లాగ్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీశాడు. అయితే ఇప్పటిదాకా ఎలా ఆడారన్నది కాదు.. ఈ ఒక్కరోజు ఎలా ఆడారన్నది మాత్రమే ముఖ్యం కాబట్టి.. వీరంతా ఎప్పటిలాగా ఆడినా ఈ మ్యాచ్ కచ్చితంగా చెన్నై గెలిచే అవకాశం ఉంది.
ఇక కోల్‌కతాది పూర్తిగా వేరే కథ. కేజీయఫ్ సినిమా ఇంటర్వల్ సీన్‌లో హీరో ఒక డైలాగ్ చెప్తాడు. ‘కొట్లాటలో ముందు దెబ్బ ఎవరి మీద పడిందన్నది కాదు.. ఎవరు కింద పడిపోయారన్నదే లెక్కలోకి వస్తుంది’ అంటాడు. ఈ డైలాగ్ కోల్‌కతా సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే లీగ్ దశలో భారతదేశంలో ఏడు మ్యాచ్‌లు జరగ్గా అందులో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా గెలిచింది. యూఏఈలో సెకండ్ లెగ్ ప్రారంభం అయ్యే సమయానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే అక్కడ నుంచి కోల్‌కతా కమ్‌బ్యాక్ చేసిన విధానం మాత్రం హైలెట్.
యూఏఈలో కోల్‌కతా తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఏడు విజయాలు సాధించింది. ఇందులో రెండు ప్లేఆప్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ తిరుగులేని ఫాంలో ఉన్నారు. మొదటి పది ఓవర్లలో వికెట్ ఇవ్వకుండా ఆడుతున్నారు. వెంకటేష్ అయ్యర్ యూఏఈలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. వీరితో పాటు వన్‌డౌన్‌లో వస్తున్న రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా కూడా మంచి ఫాంలో ఉన్నారు. అవసరం అయినప్పుడు సునీల్ నరైన్ కూడా సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. అయితే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ వరుసగా విఫలం అవుతున్నారు. పొరపాటున టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలం అయినప్పుడు వీరు బాధ్యత తీసుకుంటే కోల్‌కతాకు కాస్త అయినా ఊరట లభిస్తుంది.
ఇక కోల్‌కతా బౌలింగ్ కూడా ఎంతో బలంగా ఉంది. పేస్ బౌలర్లు శివం మావి, లోకి ఫెర్గూసన్ పరుగులను కట్టడి చేస్తూ ఉండగా.. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు వికెట్లు తీస్తున్నారు. రసెల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్ కూడా బౌలింగ్ బాగానే వేస్తున్నారు. ఇక కోల్‌కతా జాగ్రత్త పడాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. ఢిల్లీతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో 25 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో.. చేతిలో 9 వికెట్లు ఉన్నప్పటికీ చివర్లో రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితికి తెచ్చుకున్నారు. అయితే రాహుల్ త్రిపాఠి సిక్సర్ కొట్టడంతో కోల్‌కతా గట్టెక్కింది. ఇటువంటి కీలక అంశాల్లో ఒత్తిడికి లోనవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కోల్‌కతాకు ఉంది.
చెన్నై టోర్నీలో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడగా.. మొత్తం 10 విజయాలు సాధించింది. ఇందులో యూఏఈలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు ఉన్నాయి. కోల్‌కతా టోర్నీలో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడి తొమ్మిది విజయాలు సాధించింది. వీటిలో యూఏఈలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే ఈ రెండు ఓటముల్లో ఒకటి చెన్నై మీదనే కావడం కోల్‌కతాను కలవరపరిచే అంశం. ఈ రెండు జట్లూ ఐపీఎల్ ఫైనల్లో ఒకసారి మాత్రమే తలపడ్డాయి. 2012లో జరిగిన ఈ ఫైనల్లో కోల్‌కతా ఐదు వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. గత రికార్డులు ఎలా ఉన్నా.. ఆ 240 బంతుల్లో ఎవరు బాగా ఆడితే విజయం వారినే వరిస్తుంది. రెండు జట్లూ బలంగా ఉన్నాయి. ఫైనల్ కాబట్టి సర్వశక్తులూ ఒడ్డి ఆడతాయి కాబట్టి ఒక థ్రిల్లింగ్ మ్యాచ్‌ను మనం ఈరోజు చూడబోతున్నాం.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు(అంచనా)
ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప/సురేష్ రైనా, అంబటి రాయుడు, మొయిన్ అలీ, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జోష్ హజిల్‌వుడ్
కోల్‌కతా నైట్‌రైడర్స్(అంచనా)
శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్/ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, లోకి ఫెర్గూసన్, శివం మావి
Also Read: థ్రిల్లర్‌ను తలపించిన క్వాలిఫయర్ 2.. ఒత్తిడిలో చిత్తయిన ఢిల్లీ.. ఫైనల్స్‌కు కోల్‌కతా!
Also Read: కొత్త జట్ల వేలం..! టెండర్ల ప్రక్రియపై బీసీసీఐ తాజా నిర్ణయం తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి