ప్చ్‌.. ముంబయి! యూఏఈకి వచ్చాక ఏమైందో ఏమో! నెమ్మది పిచ్‌లపై తడబడుతూనే ఉంది. బౌలింగ్‌ విభాగం ఎంత పటిష్ఠంగా ఉన్నా కాపాడుకోలేని లక్ష్యాలకే పరిమితం అవుతోంది. షార్జాలో హిట్‌మ్యాన్‌ సేన నిర్దేశించిన 130 స్కోరును దిల్లీ క్యాపిటల్స్‌ తెలివిగా ఛేదించింది. కీలక వికెట్లు పడ్డా శ్రేయస్‌ అయ్యర్‌ (33; 33 బంతుల్లో 2x4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (20; 21 బంతుల్లో 1x6) ఆఖరి వరకు నిలిచి 4 వికెట్ల తేడాతో గెలుపు తలుపు తట్టారు. అంతకు ముందు ముంబయిలో సూర్యకుమార్‌ (33; 26 బంతుల్లో 2x4, 2x6) ఆకట్టుకున్నాడు. ఈ ఓటమితో రోహిత్‌సేన ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.


Also Read: ముంబయి.. ప్లీజ్‌ ఓడిపోవా! ప్లేఆఫ్స్‌ కోసం పంజాబ్‌, కోల్‌కతా కోరికలు!


శ్రేయస్‌, అశ్విన్‌ తెలివైన బ్యాటింగ్‌
స్వల్ప లక్ష్యమే అయినా పిచ్‌ కఠినంగా ఉండటం.. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో దిల్లీ ఛేదన సవ్యంగా సాగలేదు. అనవసర పరుగుకు యత్నించి రెండో ఓవర్‌ ఆఖరి బంతికి శిఖర్‌ ధావన్‌ (8) రనౌట్‌ అయ్యాడు. మరో పరుగుకే పృథ్వీ షా (6)ను కృనాల్‌ ఎల్బీగా పంపించాడు. మరో 15 పరుగులకే లెగ్‌సైడ్‌ భీకరంగా ఆడే స్టీవ్‌స్మిత్‌ (9)ను కౌల్టర్‌నైల్ బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ సాయంతో రిషభ్ పంత్‌ (26; 22బంతుల్లో 3x4, 1x6) కొన్ని విలువైన షాట్లు ఆడాడు. కీలకంగా మారిన ఈ భాగస్వామ్యాన్ని జట్టు స్కోరు 57 వద్ద పంత్‌ను ఔట్‌ చేయడం ద్వారా జయంత్‌ ఔట్‌ చేశాడు. రెండు బౌండీలు బాది ఊపుమీద కనిపించిన హెట్‌మైయిర్‌ (15)ను బుమ్రా జట్టు స్కోరు 93 వద్ద బుమ్రా పెవిలియన్‌ పంపించాడు. కీలక తరుణంలో శ్రేయస్‌, అశ్విన్ కలిసి ఆరో వికెట్‌కు 39 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టుకు విజయం అందించారు. వీరిద్దరూ షాట్లకు వెళ్లకుండా సమయం కోసం వేచిచూశారు. రన్‌రేట్‌ను అదుపులోనే ఉంచుతూ ఆఖరి వరకు తీసుకెళ్లారు. ఆఖరి ఓవర్లో 4 పరుగులు అవసరమైన తరుణంలో తొలి బంతినే అశ్విన్‌ సిక్సర్‌గా బాదేసి జట్టుకు 2 పాయింట్లు అందించాడు.


Also Read: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..


సూర్య బాదినా..!
మొదట ముంబయికి శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 8 వద్దే రోహిత్‌ (7)ను అవేశ్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ డికాక్‌ (19) ఒకట్రెండు షాట్లు ఆడినా భారీ స్కోరు చేయలేదు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటం.. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ముంబయి ఇబ్బంది పడింది. ఐతే అశ్విన్‌ను లక్ష్యంగా ఎంచుకొని సూర్యకుమార్‌ యాదవ్‌ (33) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. సౌరభ్ తివారీ (15) అతడికి తోడుగా నిలిచాడు. కీలకంగా మారిని వీరిద్దరినీ అక్షర్‌ పటేల్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపించాడు. దాంతో హిట్‌మ్యాన్‌సేన భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి. పొలార్డ్‌ (6) సైతం విఫలమయ్యాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (17), కృనాల్‌ (13*), జయంత్‌ యాదవ్‌ (11) ఒకట్రెండు బౌండరీలు కొట్టడంతో స్కోరు 129/8కి చేరుకుంది. దిల్లీలో అక్షర్‌, అవేశ్‌ తలో మూడు వికెట్లు పడగొట్టారు.


Also Read: అందం క్రికెట్‌ ఆడితే...! ఆమెను స్మృతి మంధాన అంటారు!