IND vs SL, T20I, Team India Probable XI: మరో టీ20 సమరానికి టీమ్‌ఇండియా (Team India) సై అంటోంది. గురువారం లంకేయులతో (IND vs SL) తొలి పోరులో తలపడుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదిక కానుంది. పనిభారం సమీక్షలో కొందరు, గాయాలతో మరికొందరు జట్టుకు దూరమయ్యారు. మరి రోహిత్ శర్మ (Rohit Sharma) ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతాడన్నది ఆసక్తికరం!
వేధిస్తున్న గాయాలు
టీమ్‌ఇండియాను కొన్నాళ్లుగా గాయడ బెడద వేధిస్తోంది. వరుసగా ఆటగాళ్లు గాయాల పాలవుతున్నారు. దీపక్ చాహర్, కేఎల్ రాహుల్ (KL Rahul), అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. పనిభారం వల్ల మాజీ సారథి విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చారు. అయితే జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లతో సంజు శాంసన్ జట్టులో చేరడం శుభసూచకం.
మిడిలార్డర్‌కు Rohit Sharma?
సహజంగా సీనియర్లు, రెగ్యులర్ ప్లేయర్లు దూరమైతే జట్టు కూర్పు కష్టమవుతుంది. ఈ తలనొప్పిని రోహిత్ శర్మ ఎలా అధిగమిస్తాడో చూడాలి. అత్యుత్తమ తుది జట్టును ఎలా ఎంపి చేస్తాడోనని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బహుశా వెస్టిండీస్‌తో చివరి మ్యాచులో ప్రయోగాన్ని మళ్లీ చేస్తారేమో చూడాలి. రుతరాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌తో ఓపెనింగ్ చేయిస్తారా? రోహిత్ మిడిలార్డర్‌కు వెళ్తాడా అన్నది చూడాలి.
ఇద్దరే పేసర్లు?
ఒకవేళ ఇషాన్, రుతురాజ్ ఓపెనింగ్ చేస్తే రోహిత్ వన్‌డౌన్ లేదా నాలుగో స్థానంలో వస్తాడు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వెంకటేశ్ అయ్యర్ మిడిలార్డర్‌లో ఉంటారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆ తర్వాత స్థానంలో వస్తాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భువనేశ్వర్ పేస్ బౌలింగ్ దాడి చూసుకుంటాడు. అవసరమైతే వెంకటేశ్ అయ్యర్ సాయం అందిస్తాడు. జడ్డూ, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్ స్పిన్ దాడి కొనసాగిస్తారు.
Team India probable XI
టీమ్‌ఇండియా అంచనా జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్