2022 ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించింది. పాకిస్తాన్‌పై గత 14 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది 12 సార్లు విజయం సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఆ తర్వాత పాకిస్తాన్ మనతో కనీసం డ్రా చేసుకోవడం ఇదే తొలిసారి. పాక్ మనమీద చివరిసారిగా 2016 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో విజయం సాధించింది.


మ్యాచ్‌ను భారత్ హుషారుగా ప్రారంభించింది. మొదటి క్వార్టర్‌లోనే గోల్ సాధించి 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 20 సంవత్సరాల యువ ఆటగాడు కార్తీ సెల్వం ఈ గోల్ సాధించాడు. ఆ తర్వాత మరో గోల్ సాధించడానికి ఎంత ప్రయత్నించినా... పాకిస్తాన్ డిఫెండర్లు విజయవంతంగా అడ్డుకున్నారు. అలాగే పాకిస్తాన్ స్కోరును సమం చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.


అయితే ఒక్క నిమిషంలో ఆట ముగుస్తుంది అనగా పాకిస్తాన్ ఆటగాడు అబ్దుల్ రాణా బంతిని విజయవంతంగా బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో స్కోరు సమం అయింది. పాకిస్తాన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చివర్లో కనీసం ఒక్క నిమిషం సమయం కూడా లేకపోవడంతో భారత్ మరో గోల్ చేయలేకపోయింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది.