India vs England ODI: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం అందుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉతికారేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)  తిరుగులేని ఫామ్‌ కనబరిచాడు. చాన్నాళ్ల తర్వాత  సింహగర్జన చేశాడు. తనకిష్టమైన పుల్‌షాట్లతో ప్రత్యర్థిని వణికించాడు. అయితే అతడు కొట్టిన సిక్సర్‌ ఓ చిన్నారికి తగలడంతో ఆటను కాసేపు నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో వెంటనే మొదలు పెట్టారు.


టీమ్‌ఇండియా ఇన్నింగ్సు ఐదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డేవిడ్‌ విలే వేసిన బంతిని రోహిత్‌ శర్మ తనకిష్టమైన పుల్‌షాట్‌ ఆడేశాడు. బ్యాటు మధ్యలో తగిలిన బంతి ఫైన్‌లెగ్‌లో నేరుగా జనాల మధ్యన పడింది. అంపైర్‌ వెంటనే సిక్సర్‌గా ప్రకటించాడు. కెమేరాను అటు వైపు మళ్లించడంతో ఓ వ్యక్తి చిన్నారిని సముదాయిస్తూ కనిపించాడు. ఆమె భుజాలు, మెడను రుద్దాడు. బహుశా బంతి అక్కడే తగిలినట్టుంది.


విషయం తెలియడంతో క్రికెటర్లంతా ఒక్కసారిగా అటువైపే దృష్టి సారించారు. అంతా సవ్యంగా ఉందో లేదో కనుక్కున్నారు. కామెంటరీ చేస్తున్న రవిశాస్త్రి, ఆర్థర్‌టన్‌ సైతం బంతి ఎవరినో తాకినట్టుందని ధ్రువీకరించారు. 'చూస్తుంటే రోహిత్‌ శర్మ బాదిన సిక్సర్‌ ఎవరినో తాకినట్టుంది. బహుశా ఏం కాలేదనే అనుకుంటున్నా' అని ఆర్థర్‌టన్‌ అన్నాడు. 'అవును, అలాగే అనిపిస్తోంది. బంతి కొట్టిన వైపు రోహిత్‌ అలాగే చూస్తున్నాడంటే ఎవరినో తాకిందన్న సందేశం అతడికి అందే ఉంటుంది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. స్టేడియం వైద్య సిబ్బంది సైతం బౌండరీ సరిహద్దులు దాటి అటు వైపు పరుగెత్తినట్టు టీవీ తెరల్లో ప్రసారమైంది.


IND vs ENG, 1st ODI, The Oval Stadium: గెలుపంటే ఇదీ! అన్నట్టుగా చెలరేగింది టీమ్‌ఇండియా. ఆంగ్లేయులకు తమ సొంతగడ్డపైనే కనీవినీ ఎరగని పరాభవం రుచిచూపించింది. మొదట జస్ప్రీత్‌ బుమ్రా (6/19), మహ్మద్‌ షమి (3/31)  దెబ్బకు ఇంగ్లాండ్‌ కేవలం 25.2 ఓవర్లకే 110 పరుగులకే కుప్పకూలింది. చరిత్రలోనే టీమ్‌ఇండియా చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (30; 32 బంతుల్లో 6x4), డేవిడ్‌ విలే (21; 26 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లంటేనే మన బౌలర్ల అటాక్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఆ తర్వాత రోహిత్‌ శర్మ (76; 58 బంతుల్లో 7x4, 5x6), శిఖర్ ధావన్‌ (31; 54 బంతుల్లో 4x4) ఇద్దరే కలిసి 10 వికెట్ల తేడాతో గెలిపించేశారు. విజయం కోసం కేవలం 18.4 ఓవర్లే తీసుకున్నారు.