Shahbaz Ahmed replaces injured Washington Sundar: జింబాబ్వే పర్యటనకు సంబంధించి బీసీసీఐ మరో అప్‌డేట్‌ ఇచ్చింది. గాయపడిన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో ఆల్‌ రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ను ఎంపిక చేశామని తెలిపింది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా సుందర్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా ఇప్పటికే జింబాబ్వే చేరుకుంది. హరారే క్రికెట్‌ స్టేడియంలో సాధన చేస్తోంది.


తెలివైన ఆల్‌రౌండరే


బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా షాబాజ్‌ అహ్మద్‌కు మంచి పేరుంది. దేశవాళీ క్రికెట్లో బంగాల్‌, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అతడు అదరగొడుతున్నాడు. 18 ఐపీఎల్‌ మ్యాచుల్లో బ్యాటింగ్‌లో 41.64, బౌలింగ్‌లో 19.47 సగటుతో ఆకట్టుకున్నాడు. లిస్ట్‌-ఏ క్రికెట్లో అతడి సగటు వరుసగా 47.28, 39.20గా ఉన్నాయి.


రెండేళ్ల క్రితం బంగాల్‌ తరఫున అరంగేట్రం చేసిన షాబాజ్‌ 2020లో ఆర్సీబీలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్లో 29 మ్యాచుల్లో 18.60 సగటు, స్ట్రైక్‌రేట్‌ 118.72 స్ట్రైక్‌రేట్‌తో 279 పరుగులు చేశాడు. ఇక 36.31 సగటు, 8.58 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. జాతీయ జట్టుకు పిలుపు రావడం అతడికిదే తొలిసారి.


ప్చ్‌.. సుందర్‌!


వాషింగ్టన్‌ సుందర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన చాలా రోజులైంది. ఐపీఎల్‌ తర్వాత అతడు గాయపడ్డాడు. బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. గాయం నయమవ్వడంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక రాయల్‌ లండన్‌ కప్‌లో లాంకాషైర్‌కు ఆడుతున్నాడు. ఆగస్టు 10న ఓల్డ్‌ ట్రాఫోర్డులో వార్విక్‌షైర్‌తో మ్యాచులో డైవ్‌ చేస్తూ గాయపడ్డాడు. జింబాబ్వే సిరీస్‌ ఆడే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నాడు.


జింబాబ్వే సిరీసుకు భారత జట్టు


కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), షాబాజ్‌ అహ్మద్‌, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్


భారత జట్టులోని రెగ్యులర్ వన్డే సభ్యులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. జింబాబ్వేతో ఆగస్టు 18వ తేదీన హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వేకు వికెట్ కీపర్-బ్యాటర్ రెగిస్ చకబ్వా నాయకత్వం వహించనున్నాడు. రెండో, మూడో వన్డేలు ఆగస్టు 20వ తేదీ, 22వ తేదీల్లో హరారే వేదికగా జరగనున్నాయి.