టోక్యో పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఒక విజయం... ఒక పరాజయంతో ముగించింది. భారత ప్యాడ్లర్‌ భావినాబెన్‌ పటేల్‌ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో ప్రి క్వార్టర్స్‌ చేరుకుంది. గ్రేట్‌ బ్రిటన్‌ అమ్మాయి మేగన్‌ షక్లెటన్‌తో జరిగిన మ్యాచులో 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో ఆమె 11-7, 9-11, 17-15, 13-11 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.






భావినా బుధవారం జరిగిన తొలి రౌండు పోరులో పరాజయం చవిచూసింది. ఆమె పై పోరుకు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో దూకుడుగా ఆడి మొదటి ఎనిమిది నిమిషాల్లోనే తొలి రౌండ్‌ గెలిచింది. అయితే ఆ తర్వత ప్రత్యర్థి పుంజుకోవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. చివరికి భావినా విజయం సాధించింది. మొత్తంగా రెండు మ్యాచుల్లో 3 పాయింట్లతో ఆమె ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.


‘మున్ముందు జరిగే మ్యాచుల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఈ రోజు చాలా ఓపికగా ఆడాను. మ్యాచు వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. కఠిన మ్యాచులో గెలిచినందుకు సంతోషంగా ఉంది’ అని భావినా తెలిపింది.






సోనాల్‌బెన్ మనుబాయ్ పటేల్ ఓటమి


టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌ క్లాస్ -3 విభాగంలో ప్యాడ్లర్ సోనాల్‌బెన్ మనుబాయ్ పటేల్ ఓడిపోయింది. రెండో రౌండ్లో ఆమె లీ మై గ్యూ చేతిలో 3-1 తేడాతో ఓడిపోయింది. కేవలం 30 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. తొలి గేమ్ గెలిచిన సోనాల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.