India Archery Team Wins Gold At World Championships | ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా కుర్రాళ్లు అద్భుతం చేశారు. ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్ నిలిచింది. భారత పురుషుల జట్టు తొలిసారి స్వర్ణం సాధించింది. దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 235-233 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా తొలిసారి భారత మెన్స్ టీమ్ గోల్డ్ సాధించింది. రిషభ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేశ్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. స్వర్ణం సాధించిన భారత ఆర్చరీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశం గర్వించేలా చేశారంటూ క్రీడారంగ ప్రముఖులతో పాటు దేశం మొత్తం వీరి ఘనతను ప్రశంసిస్తోంది.
విజేతలుగా ఎలా మారారంటే.. రౌండ్ల వారీగా ఫలితాలు
భారత్‌కు చెందిన ఆర్చర్లు ప్రథమేశ్, అమన్ సైనీ, రిషభ్ యాదవ్ త్రయం ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో రౌండ్ 16 విభాగంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించారు. మొదట ఇరు జట్లు 232 పాయింట్లు సాధించాయి. తరువాత భారత్ 30- 28 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 234-233 తేడాతో అమెరికాను ఇంటికి పంపింది. కీలకమైన సెమీఫైనల్లో టర్కీ మీద 234-232 తేడాతో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. సెప్టెంబర్ 7న ఆదివారం జరిగిన ఫైనల్లో పటిష్ట ఫ్రాన్స్ మీద భారత పురుషుల జట్టు విజయదుందుబి మోగించింది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చేజారిన స్వర్ణం..
భారత్‌కు చెందిన ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, రిషబ్ యాదవ్ మిక్స్‌డ్ డబుల్స్ టీం ఫైనల్‌లో నెదర్లాండ్స్ చేతిలో 155-157 తేడాతో ఓడింది. దాంతో భారత మిక్స్‌డ్ డబుల్స్ టీమ్ రజత పతకాన్ని అందుకుంది. ఆ తరువాత జరిగిన పురుషుల ఫైనల్లో భారత జట్టు రాణించి తమ కలను నెరవేర్చుకుంది. 23 ఏళ్ల రిషబ్ యాదవ్ మిక్స్‌డ్ డబుల్స్ లో రజతం, మెన్స్ టీంలో స్వర్ణం కొల్లగొట్టిన జట్టులో సభ్యుడు.
తొలి 3 సెట్ల తర్వాత భారత్, ఫ్రాన్స్ జట్లు 176-176తో స్కోరు సమం కావడంతో, రెండవ సీడ్‌లో ఉన్న భారత జట్టు నిర్ణయాత్మక రౌండ్‌లో పట్టు నిలుపుకుంది. ఆ సెట్లో భారత్ 59 పాయింట్లు సాధించగా, ఫ్రాన్స్ 57 పాయింట్లతో వెనుకంజ వేసింది. దాంతో 2 పాయింట్ల తేడాతో భారత పురుషుల ఆర్చరీ జట్టు స్వర్ణాన్ని తమ ఖాతాలో వేసుకుంది.