Tata Motors Sierra EV and premium Avinya range Latest News: తమ ఈవీ రేంజీని మరింత బలపరిచే, సియోరా అవిన్య వాహనాలపై టాటా మోటార్స్ గట్టిగా దృష్టి సారించింది. గేమ్ చేంజర్ లా అనిపించే కొత్త కొత్త ఫీచర్లు, అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లతో ఈ కార్లను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని విస్తరించేందుకు కర్వ్ ఈవి (Curvv EV) , హ్యారియర్ ఈవి (Harrier EV) మోడళ్లను పరిచయం చేసింది, ఇవి రెండూ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శించ బడ్డాయి.
కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం చివరికి సియేరా ఈవి (Sierra EV)ని విడుదల చేయాలని భావిస్తోంది, దీని తరువాత 2027-28 మధ్యలో ప్రీమియం అవిన్య శ్రేణి (Avinya range) రానుంది. ప్రస్తుతం ఉన్న టాటా ఈవీలతో పోలిస్తే, అవిన్య రేంజీ వెహికిల్స్ పూర్తి భిన్నంగా ఉండనున్నాయి. ఎందుకంటే ఇది జేఎల్ఆర్ (JLR) నుండి వచ్చిన ఈఎంఎ (EMA – ఎలక్ట్రిఫైడ్ మోడ్యూలర్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడనుంది. ఈ ప్రత్యేకమైన "స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్" ద్వారా టాటా, ఉన్నత సాంకేతికత , విలాసవంతమైన ఫీచర్లతో అవిన్యను మరింత ప్రీమియంగా తయారు చేయగలదని భావిస్తోంది. ఇది టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో అత్యున్నత స్థాయిలో ఉండే ఈవీగా ఉండనుంది.
భవిష్యత్ ప్రణాళికలు.. FY30 నాటికి 30 కొత్త వాహనాలను, అందులో ఏడు పూర్తిగా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని టాటా యోచిస్తోంది, దీంట్లో అవిన్యకు ప్రత్యేక స్థానం కల్పించే అవకాశముంది. ఇది టాటా పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేక బ్రాండ్‌లా ఉండేలా చేసి, భవిష్యత్తులో క్రాస్-కూప్ వేరియంట్లకు మార్గం ఏర్పడుతుంది. మొదట్లో ఈఈఎంఎ ప్లాట్‌ఫారమ్‌ను భారతదేశంలో ఉత్పత్తి చేసి స్థానికీకరించాలని యోచించారు, దీని ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు రాయల్టీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, స్థానిక భాగాల సరఫరాదారులు తగిన నాణ్యత ప్రమాణాలు ధరలను అందించలేకపోవడంతో జేఎల్ఆర్ ఈ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో సరఫరాదారులతో చర్చలు నిలిచిపోయాయి, తద్వారా ఈఎంఎ ఆధారిత వాహనాల విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఇది టాటా మోటార్స్ ప్రీమియం ఈవి వ్యూహంపై ప్రభావం చూపిస్తోంది, ముఖ్యంగా అవిన్య శ్రేణి వాహనాల విషయంలోనూ అదే ప్లాట్‌ఫారమ్‌పై రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత ఇంకా లేదు.
భిన్నమైన డిజైన్..కొన్ని సంవత్సరాల క్రితం జనరేషన్ 3 ప్లాట్‌ఫారమ్‌పై ప్రదర్శించబడిన అవిన్య కాన్సెప్ట్, డిజైన్ పరంగా పూర్తిగా భిన్నంగా ఉండి, అంతర్గత విభాగంలో పెద్ద టచ్‌స్క్రీన్‌లను తొలగించి డాష్‌బోర్డ్‌పై హిడెన్ డిస్‌ప్లేను కలిగి ఉండటం ద్వారా ఓపెన్‌నెస్ ఫీలింగ్ ఇచ్చిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్గతంగా ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్‌లను ఏర్పాటు చేయడం, వాయిస్ కమాండ్ల ద్వారా ఇంటీరియర్ ఫంక్షన్‌లను నిర్వహించగల సామర్థ్యం ఉండటం వంటి అద్భుతమై ఫీచర్లు అందించబడ్డాయని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రదర్శించబడిన అవిన్య X మోడల్, ఈ కాన్సెప్ట్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రదర్శించింది. భవిష్యత్తులో కంపెనీ తరపున తురుపుముక్కలా ఈ మోడల్ ఉండనుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.