Nikhat Zareen Wins Gold: ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ మరోసారి దుమ్మురేపింది. కామన్వెల్త్ క్రీడల్లో ఈ తెలంగాణ బాక్సర్ పంచ్ పవర్‌ను ప్రదర్శించింది. మహిళల 50 కిలోల ఫ్లైవెయిట్‌లో స్వర్ణ పతకం ముద్దాడింది. ఐర్లాండ్ బాక్సర్ మెక్‌నాల్‌ను సునాయాసంగా చిత్తు చేసింది. న్యాయనిర్ణేతలు ఏక గ్రీవంగా ఆమెను విజేతగా ప్రకటించారు. ఈ సీజన్లో ఆమెకు ఇది మూడో అంతర్జాతీయ పతకం కావడం గమనార్హం.
హ్యాట్రిక్ మెడల్స్
ఇదే విభాగంలో ఒకప్పుడు మేరీకోమ్ తలపడేది. ఇప్పుడు ఆమె వారసత్వాన్ని నిఖత్ కొనసాగిస్తోంది. అతి కొద్ది కాలంలోనే 'గోల్డెన్ గర్ల్' అని పేరు తెచ్చుకుంది. కొన్ని రోజుల క్రితమే ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం అందుకొని సగర్వంగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా మొమొరియల్ బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకం కొల్లగొట్టింది. తాజాగా కామన్వెల్త్‌లో బంగారు పతకం అందుకుంది. ఆదివారం బాక్సింగ్‌లో మూడో స్వర్ణం తెచ్చింది. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ బాక్సర్ స్టుబ్లే అల్ఫియా సవన్నాను 5-0 తేడాతో నిఖత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
మోదీ ప్రశంసలు
స్వర్ణం గెలిచిన నిఖత్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. 'నిఖత్ జరీన్ భారత్ గర్వపడే బాక్సర్. ఆమె ప్రపంచ స్థాయి అథ్లెట్. తన నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాలను బలంగా నమ్ముతుంది. కామన్వెల్త్‌లో బంగారు పతకం సాధించినందుకు అభినందిస్తున్నా. అంతర్జాతీయ టోర్నీల్లో ఆమె నిలకడగా రాణిస్తోంది. భవిష్యత్తులోనూ అదరగొట్టాలని కోరుకుంటున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
టేబుల్ టెన్నిస్‌లో రజతం
టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్, సాతియన్ జోడీ రజతం కైవసం చేసుకుంది. స్వర్ణం కోసం జరిగిన పోరులో ఇంగ్లాండ్ ద్వయం డ్రింఖాల్, పిచర్డ్ చేతిలో 2-3 తేడాతో పోరాడి ఓడింది.
ప్చ్ .. కిదాంబి!
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో గుంటూరు మిర్చీ కిదాంబి శ్రీకాంత్ ఓటమి చవిచూశాడు. మలేసియా షట్లర్ జె యోన్ చేతిలో 21-13, 19-21, 10-21 తేడాతో పరాజయం పొందాడు. జియా హెంగ్‌తో కాంస్యం కోసం పోరాడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ చాన్, మెంగ్ (మలేసియా) జంటను 21-6, 21-15 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మహిళల 4x100 మీటర్ల రిలేలో భారత జట్టు ఐదో స్థానంలో నిలిచింది. 43.81 సెకన్లలో రేసు ముగించింది.