టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు ఎన్టీఆర్(NTR). ఇటీవల 'ఆర్ఆర్ఆర్'(RRR) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్.. ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. ముందుగా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో సినిమాను పూర్తి చేయనున్నారు. అలానే ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాలు ఒప్పుకున్నారు. నిజానికి ఆగస్టులోనే కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ షూటింగ్ అనుకున్నదానికంటే ఆలస్యమవుతూ వస్తోంది. 


దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యం పాడైందని సమాచారం. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతున్నారట. ఇటీవల 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా ఈ సమస్యతో బాధపడుతూనే హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్స్.. ఎన్టీఆర్ ను నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారట. సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో పాల్గొనడం, రోప్ లు కట్టుకొని ఫైట్ లు చేయడం వలన హీరోలకు కొన్ని సమస్యలు వస్తుంటాయి. షోల్డర్ పెయిన్, నడుం నొప్పితో బాధపడుతుంటారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడ్డాడు. ఆ సమయంలోనే అతడికి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు డాక్టర్స్ సూచనలతో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.


ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ పని మీద ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి కానీ మొదలుకానుందని.. కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రెండు నెలల పాటు ఎన్టీఆర్ రెస్ట్ మోడ్ లో ఉంటే షూటింగ్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. మరోపక్క 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాను కూడా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట ఎన్టీఆర్. రెండు నెలల్లో స్క్రిప్ట్ పూర్తయితే.. కొరటాల శివ, బుచ్చిబాబు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎన్టీఆర్. 


రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలనేది ఎన్టీఆర్ ప్లాన్. తమిళ దర్శకుడు వెట్రిమారన్ కూడా రీసెంట్ గా ఎన్టీఆర్ ని కలిశారు. అతడితో కలిసి పని చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపించారు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు లేవు. ఎన్టీఆర్, వెట్రిమారన్ ఇద్దరికీ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమాను 2023 మిడ్ లో మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.


Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!


Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!