Wriddhiman Saha slams Sourav Ganguly, Rahul Dravid, BCCI: టీమ్‌ఇండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (wriddhiman saha) బీసీసీఐపై (BCCI) ఎదురుదాడికి దిగాడు! తనతో మాట్లాడింది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది మరొకటని పేర్కొన్నాడు. జట్టులో తనకు చోటు ఉంటుందని సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) హామీ ఇస్తే కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మాత్రం వీడ్కోలు నిర్ణయానికి సమయం వచ్చిందని పరోక్షంగా చెప్పాడని వివరించాడు. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) సైతం మరోలా మాట్లాడుతున్నారని వెల్లడించాడు. శ్రీలంక సిరీసుకు జట్టును ఎంపిక చేసిన తర్వాత సాహా మీడియాతో మాట్లాడాడు.
దాదా అలా..!
'నేనిక్కడ (బీసీసీఐలో) ఉన్నంత వరకు నువ్వు జట్టులో ఉంటావ్' అని కాన్పూర్ టెస్టు తర్వాత వృద్ధిమాన్ సాహాకు సౌరవ్ గంగూలీ వాట్సాప్ సందేశం పంపించాడు. న్యూజిలాండ్‌పై 61 పరుగులతో అజేయంగా నిలవడంతో అభినందిస్తూ పంపించాడు. కానీ రెండు నెలల్లో పరిస్థితులు తలకిందులయ్యాయి. సాహాకు జట్టులో చోటు పోయింది. యువ ఆటగాళ్లను సానబెట్టేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని సెలక్టర్లు చెప్పారు. జట్టులో చోటు కోల్పోయిన బాధలో సాహా మీడియాతో మాట్లాడాడు.
ద్రవిడ్ ఇలా..!
'కాన్పూర్‌లో న్యూజిలాండ్‌పై 61 పరుగులు చేశాక దాది (గంగూలీ) వాట్సాప్‌లో నన్ను అభినందించాడు. బీసీసీఐ ఆయన ఉన్నంత వరకు నాకు జట్టులో చోటు ఉంటుందన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు పంపించిన ఆ సందేశం నాలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపింది. కానీ రెండు నెలల్లో పరిస్థితులు ఇంతలా మారిపోవడమే నా హృదయాన్ని పిండేస్తోంది' అని సాహా అన్నాడు. 'దాదా సందేశం పంపించిన తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్ నన్ను పిలిచాడు. బహుశా ఆయన తన ప్రణాళికల గురించి నాతో మాట్లాడేందుకు పిలిచారని అనుకున్నా. కానీ అలా జరగలేదు' అని సాహా వివరించాడు.
'రాహుల్ భాయ్ మాట్లాడుతూ.. ఇదెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కొద్దిమంది సెలక్టర్లు, జట్టు యాజమాన్యం కొత్త కీపర్‌ను ప్రయత్నించాలని భావిస్తున్నారని చెప్పాడు. నా వయసు లేదా ఫిట్‌నెస్ వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగాడు. వయసు, ప్రదర్శన ఆధారంగా కాదని రాహుల్ భాయ్ చెప్పాడు. నాకు తుది జట్టులో అవకాశం దొరకడం లేదు కాబట్టి యువ ప్రతిభావంతులను పరీక్షించాలనుకుంటున్నట్టు చెప్పాడు' అని సాహా వెల్లడించాడు.
చేతన్ శర్మ మరోలా..!
శ్రీలంక సిరీసుకు జట్టు ఎంపిక తర్వాత చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ మాట్లాడిన విధానం పూర్తి భిన్నంగా ఉందని సాహా అన్నాడు. 'ఫిబ్రవరి మొదటి వారంలో నాకు చేతన్ ఫోన్ చేసి రంజీ ట్రోఫీ గురించి అడిగాడు. అందుకు మరికొన్ని రోజుల సమయం ఉందన్నాను. ఓకే చెప్పిన ఆయన భవిష్యత్తు దృష్ట్యా కొత్త వారిని ప్రయత్నించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. నేను రెండో వికెట్‌కీపర్‌గా ఉంటుండటంతో కొత్త వారిని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పాడు. శ్రీలంక సిరీసుకు నన్ను ఎంపిక చేయనని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్, ఆ తర్వాత నన్ను పరిగణనలోకి తీసుకుంటారా అని అడిగాడు. ఓ రెండు సెకన్లు ఆగి ఇకపై నన్ను పరిగణనలోకి తీసుకోరని చెప్పాడు. కొత్త వారిని వెంటనే పక్కకు తప్పించలేమన్నాడు. ఇష్టమైతే రంజీ ట్రోఫీ ఆడొచ్చని, తుది నిర్ణయం మాత్రం నాదేనని పేర్కొన్నాడు. నా ప్రదర్శన, వయసే కారణమా అని అడిగితే కాదన్నాడు' అని సాహా చెప్పాడు.
దక్షిణాఫ్రికా పర్యటన సమయంలోనూ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇదే విషయం తనతో మాట్లాడారని సాహా వివరించాడు. ఇప్పటికైతే తాను క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదన్నాడు. తన భార్య డెంగీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని బెంగాల్‌కు రంజీల్లో ఆడతానని వెల్లడించాడు.