మానవచెవి ఒక అద్భుతమైన అవయవం. దాని పనితీరు కూడా చాలా అమోఘంగా ఉంటుంది. చెవి లోపలి భాగం కోసం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. తనను తానే నిర్వహించుకోగల సత్తా ఉన్న శరీర అవయవం చెవి. అయినా మనం వీలున్నప్పుడల్లా జడపిన్నులు, కాటన్ ఇయర్ బడ్స్ వంటివి లోపల పెట్టి చెవిని క్లీన్ చేస్తున్నామని భ్రమిస్తూ ఉంటాం. గులిమి ఒక చెడు పదార్థం అని, దాన్ని తొలిగిస్తే చెవి బాగా వినిపిస్తుందని అనుకుంటాం. కానీ ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు. 


గులిమిని ఆంగ్లంలో ఇయర్ వాక్స్ అంటారు. ఇది చెవి కెనాల్ లో ఉత్పత్తి అవుతుంది. దాన్ని ప్రత్యేకంగా మనం తీయక్కర్లేదు. గులిమి అవసరం లేదు అనుకుంటే చెవి వ్యవస్థే దాన్ని సహజంగానే బయటికి పంపేస్తుంది. ఇయర్ బడ్స్ వాడడం వల్ల చెవిలో బ్యాక్టిరియా చేరుతోందని, వాటిని అనవసరంగా వాడడం తగ్గించేలా చేయాలని అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థలకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. 


ఇయర్ బడ్స్‌తో శుభ్రం చేసుకోవం అవసరమా?
మన డీఎన్ఏలో అంతర్లీనంగానే ఆటో క్లీన్ ప్రోగ్రామ్ ఉంది. చెవికి కూడా ఇది వర్తిస్తుంది. చెవిలో గులిమి పేరుకుపోకుండా మనం శుభ్రం చేసుకోక్కర్లేదు. చెవి నుంచి గులిమి చిన్న చిన్న పొరలుగా బయటికి వచ్చేస్తుంది. కొన్నిసార్లు మాత్రం గులిమి మరీ గట్టిగా మారుతుంది. అప్పుడు మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. 


ఇయర్‌బడ్స్ హానికరమా?
చాలా మంది పొడవుగా, సన్నగా ఉన్న చాలా వస్తువులను చెవిలో పెడుతుంటారు. ఇయర్ బడ్స్ మాత్రమే కాకుండా అగ్గిపుల్లలు, జడపిన్నుల్లాంటివి వాడుతుంటారు. వీటిని చెవిలో పెట్టడం వల్ల చెవి కెనాల్ లేదా ఇయర్‌డ్రమ్ దెబ్బతింటుందని అమెరికన్ డాక్టర్ ష్మెర్లింగ్ హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం చెవి తనకు తానుగా గులిమిని బయటికి పంపించే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. పొరపాటున చెవిలో ఇన్ఫెక్షన్ చేరితే అది చాలా ప్రమాదకరంగా మారి ఐసీయూలో చేరాల్సి రావచ్చని వివరించారు. 


గులిమి అవసరమే...
చెవిలో గులిమి సహజంగా ఏర్పడుతుంది. అది ఉండే అపరిశుభ్రంగా ఉన్నట్టు కాదు. ఇయర్ వాక్స్‌ను సెరుమెన్ అని పిలుస్తారు. ఇది చెవిలో సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చెవిలోపలి చర్మం పొడిగా మారకుండా కాపాడుతుంది. చెవి కెనాల్‌లోకి మురికి, దుమ్ము, ధూళి వంటివి చేరకుండా అడ్డుకుంటుంది. లోపల చనిపోయిన చర్మకణాలను, ధూళిని తనతో పాటూ కూడగడుతుంది. బ్యాక్టిరియాను లోపలికి వెళ్లనివ్వదు. కొత్త గులిమి ఉత్పత్తి అవ్వగానే, పాతదాన్ని బయటికి పంపించేస్తుంది చెవి. 


గులిమిని తీయడం కోసం ఎక్కువగా కష్టపడకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు చెవిలో పెట్టే పదునైన వస్తువుల వల్ల ఇయర్‌డ్రమ్ పాడైతే  వినికిడి సమస్యలు మొదలవుతాయి.