శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతోపాటు సిరీస్‌ను కూడా 2-0తో క్వీన్‌స్వీప్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 208 పరుగులకు ఆలౌట్ అయింది. దిముత్ కరుణరత్నే (107: 174 బంతుల్లో, 15 ఫోర్లు) సెంచరీ చేయగా... కుశాల్ మెండిస్ (54: 60 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీ చేశాడు. వీరి తర్వాత ఎక్కువ పరుగులు చేసింది డిక్‌వెల్లా (12) మాత్రమే. ఇంకెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు.


446 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే ఫాంలో ఉన్న ఓపెనర్ లహిరు తిరిమన్నె (0)  అవుటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు.


వీరిద్దరూ రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించారు. ఉన్నంతసేపు వేగంగా ఆడిన కుశాల్ మెండిస్‌ను అశ్విన్ అవుట్ చేసి భారత్‌కు రెండో వికెట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలబడలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కరుణరత్నే మాత్రం నిలకడగా ఆడాడు. సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు.


కరుణరత్నే అవుటయ్యాక నాలుగు పరుగుల్లోనే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసిపోయింది. 208 పరుగులకు శ్రీలంకను టీమిండియా ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌కు నాలుగు వికెట్లు దక్కగా... బుమ్రా మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్‌కు రెండు వికెట్లు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కాయి.