IND vs SL, 1st T20, Ekana Sports City:
శ్రీలంకతో మ్యాచులో టీమ్‌ఇండియా ఇరగదీసింది! పర్యాటక జట్టుకు 200 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. చిచ్చరపిడుగు, ఝార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ (89; 56 బంతుల్లో 10x4, 3x6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారీ అర్ధశతకంతో దుమ్మురేపాడు. అతడికి తోడుగా కెప్టెన్ రోహిత్ శర్మ (44; 32 బంతుల్లో 2x4, 1x6) దూకుడుగా ఆడాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (57*; 28 బంతుల్లో 2x4, 2x6) మెరుపులు మెరిపించాడు. లంకలో దసున్ శనక, లాహిరు కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
మొదట ఇషాన్ దంచుడు
విండీస్ సిరీసులో విఫలమైన ఇషాన్ కిషన్ ఈ మ్యాచులో రెచ్చిపోయాడు. తొలి 14 బంతుల్లో అతడు చేసింది 17 పరుగులే. ఆ తర్వాత మాత్రం లంకేయులకు చుక్కలు చూపించాడు. మరో 14 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. అతడు బాదిన సిక్సర్లు, బౌండరీలు చూస్తుంటే అందరికీ మజా వచ్చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మొదట్లో వేగంగా ఆడాడు. ఇషాన్ జోరు పెంచడంతో సెకండ్ ఫిడిల్ ప్లే చేశాడు. అందమైన బౌండరీలు బాదేస్తూనే పరుగులు సాధించాడు. వీరిద్దరూ విధ్వంసకరంగా ఆడటంతో తొలి వికెట్‌కు 111 పరుగులు వచ్చాయి. 12వ ఓవర్ ఆఖరి బంతికి రోహిత్‌ను లాహిరు బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది.
ఆఖర్లో శ్రేయస్ బాదుడు
రోహిత్ ఔటైన సంతోషం లంకేయులకు ఎక్కువ సేపు నిలవలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. ఇషాన్‌తో పాటు అతడూ షాట్లు బాదేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సెంచరీకి చేరువైన కిషన్‌ను జట్టు స్కోరు 155 వద్ద దసున్ శనక ఔట్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (3) సహకారంతో శ్రేయస్ రెచ్చిపోయాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. జట్టు స్కోరును 199కి చేర్చాడు. ఈ మ్యాచులో రోమిత్ శర్మ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మార్టిన్ గప్తిల్, విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.