KL Rahul ruled out: దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ! కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul), స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ గాయపడ్డారు. సిరీస్ మొత్తానికీ వీరిద్దరూ దూరమవుతున్నారు. రాహుల్ స్థానంలో రిషభ్‌పంత్ (Rishabh Pant) జట్టును నడిపిస్తాడని బీసీసీఐ తెలిపింది.
టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా (India vs South Africa T20 series) మధ్య 5టీ20ల సిరీస్ గురువారం నుంచే మొదలవుతోంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే యువకులతో కూడిన జట్టు కఠోరంగా సాధన చేస్తోంది. కాగా రెండో ప్రాక్టీస్ సెషన్లో రాహుల్ గాయపడ్డాడని తెలిసింది. వెంటనే అతడిని సాధన నుంచి తప్పించారు. మున్ముందు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్, పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ నుంచి తప్పించారు. చాన్నాళ్ల తర్వాత టీమ్‌ఇండియాలోకి వచ్చిన కుల్‌దీప్ యాదవ్ సైతం గాయపడటం గమనార్హం.
ప్రస్తుతం కేఎల్ రాహుల్ గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిసింది. గాయం తీవ్రత ఇంకా తెలియలేదు. సిరీస్ మొత్తానికీ దూరమవ్వడం కచ్చితంగా లోటే. అయితే కుర్రాళ్లను పరీక్షించేందుకు ఇదో అవకాశంగా మారనుంది. ఇప్పటికైతే బోర్డు రాహుల్ గాయం తీవ్రత గురించి సమాచారం ఇవ్వలేదు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి వంటి సీనియర్లకు విశ్రాంతినివ్వడం గమనార్హం.
దక్షిణాఫ్రికా టీమ్‌ఇండియాతో ఐదు టీ20లు ఆడనుంది. జూన్ 9న దిల్లీ, 12న కటక్, 14న వైజాగ్, 17న రాజ్‌కోట్, 19న బెంగళూరులో మ్యాచులు ఆడుతుంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుంది. టీమ్‌ఇండియా అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అంతకన్నా ముందు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఉంటాయి.
టీ20 జట్టు: కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్