టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ దక్షిణాఫ్రికాలో ఎలా ఆడాలో చర్చించుకున్నారు. అక్కడి పిచ్‌లు ఎలాంటి సవాళ్లు విసురుతాయో మాట్లాడుకున్నారు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అనుభవం తమకు ఎలా ఉపయోగపడుతుందో పేర్కొన్నారు. టెస్టు మ్యాచుకు ముందు వీరిద్దరూ బీసీసీఐ ఏర్పాటు చేసిన పరస్పరం ముఖాముఖిలో మాట్లాడుకున్నారు. బీసీసీఐ ట్వీట్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డిసెంబర్‌ 26న మొదలవుతున్న తొలి టెస్టులో వీరిద్దరూ ఓపెనింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.






'దక్షిణాఫ్రికా పిచ్‌లపై స్పాంజీ బౌన్స్‌ ఉంటుంది. సెంచూరియన్‌లో మరీ ఎక్కువ. ఇది మనకు సవాల్‌ విసురుతుంది. నువ్వు మరింత ఓపిగ్గా బ్యాటింగ్‌ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే సఫారీల ఫాస్ట్‌బౌలింగ్‌ దాడి ఎలా ఉంటుందో మనకు తెలుసు. డగౌట్‌లో కూర్చొని చూశాను కాబట్టి గత సిరీసులో విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ అద్భుతమనే చెప్పాలి' అని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.


'కొత్త బంతికి అలవాటు పడ్డారంటే దక్షిణాఫ్రికాలో బ్యాటింగ్‌ను చాలా ఎంజాయ్‌ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడి పిచ్‌లపై పేస్‌, బౌన్స్‌ ఉంటుంది. ఔట్‌ఫీల్డ్‌ వేగంగా ఉంటుంది కాబట్టి ఓపెనర్లకు తొలి 30-35 ఓవర్లు అత్యంత సవాల్‌గా ఉంటుంది. ఓపికగా ఉండి ఔట్‌సైడ్‌ ది ఆఫ్‌స్టంప్‌ బంతులు వదిలేస్తే మంచిది. దానికి అలవాటు పడితే మనం పరుగులు చేయగలం' అని మయాంక్‌ అన్నాడు.






కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ ప్రశంసలు కురిపించారు. 'ఈసారి రాహుల్‌ ద్రవిడ్‌ ఉండటం సాయపడుతుంది. ఇక్కడ ఆయన చాలా క్రికెట్‌ ఆడారు. ఎన్నో పరుగులు చేశారు. నాలుగైదు రోజులు శిక్షణలోనే ఆయన అనుభవాన్ని మనతో పంచుకున్నారు. అత్యుత్తమంగా ఎలా సన్నద్ధం అవ్వాలో నేర్పించారు. ఇది మనకు నిజంగా బూస్టే' అని రాహుల్‌ అన్నాడు.


'మన ఆట, వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని రాహుల్‌ ద్రవిడ్‌ బాగా అర్థం చేసుకుంటారు. ఆయన చెప్పేవి విని మన సమస్యలు పరిష్కరించుకుంటే బాగా రాణించొచ్చు. మనల్ని బాగా సన్నద్ధం చేయడం పైనే ఆయన దృష్టి పెట్టారు' అని మయాంక్‌ పేర్కొన్నాడు. ఓపెనర్లుగా రాహుల్‌, మయాంక్‌కు ఒకరి ఆటపై మరొకరికి అవగాహన ఉంది. గతంలోనూ వీరిద్దరూ కలిసి చాలాసార్లు ఓపెనింగ్‌ చేశారు.