ఒకే బలహీనత..! టీమ్‌ఇండియాను పదేపదే ఇబ్బంది పెడుతోంది. కీలక మ్యాచుల్లో విజయాలకు దూరం చేస్తోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి పాలు చేసింది. విదేశాలకు వెళ్లినప్పుడు కోహ్లీసేన పరువుకు భంగం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా సిరీసులోనూ ఈ వీక్‌నెస్ వెంటాడింది.
సెంచూరియన్ టెస్టు మూడోరోజు ఆట ఆరంభించే సమయానికి టీమ్‌ఇండియా స్కోరు 272. చేజార్చుకున్న వికెట్లు కేవలం 3. సెంచరీ చేసిన ఆత్మవిశ్వాసంతో కేఎల్ రాహుల్, చక్కని షాట్లు, అద్భుతమైన టెంపర్‌మెంట్‌తో అర్ధశతకం వైపు సాగుతూ అజింక్య రహానె క్రీజులోకి అడుగు పెట్టారు. పది నిమిషాలు గడిచిందో లేదో గంట సేపట్లో వికెట్లన్నీ టపా.. టపా.. పడిపోయాయి! 55 పరుగుల వ్యవధిలో కోహ్లీసేన మిగిలిన 7 వికెట్లను చేజార్చుకుంది.
వర్షం పడినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయం పూట బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంటుంది. సరైన లెంగ్తుల్లో విసిరితే ఏ బ్యాటర్‌కైనా పరుగులు చేయడం కష్టం. కానీ వికెట్లనైతే నిలుపుకోవచ్చు! మంగళవారం టీమ్‌ఇండియా వికెట్లు నిలుపుకోవడంలో విఫలమైంది. ఓవర్‌నైట్ స్కోరుకే కేవలం ఒక పరుగు జత చేసిన వెంటనే కేఎల్ రాహుల్‌ను రబాడా ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 278.
అర్ధశతకానికి రెండు పరుగుల దూరంలో అజింక్య రహానెను ఎంగిడి పెవిలియన్ పంపించాడు. దాంతో 291కి ఐదు వికెట్లు పడ్డాయి. అక్కడి నుంచి రిషభ్ పంత్ 8 పరుగులు చేస్తే, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ చేసింది చెరో 4 పరుగులు. షమి 8 పరుగులు చేయగా, సిరాజ్ 4తో నాటౌట్‌గా నిలిచాడు. బుమ్రా 14 పరుగులు చేయబట్టి ఆ మాత్రం స్కోరైనా పెరిగింది.
గతంలోనూ ఇలాంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో జట్టంతా 36 పరుగులకే కుప్పకూలితే.. సరే మూకుమ్మడిగా విఫలమయ్యారని అనుకోవచ్చు. కానీ పటిష్ఠ స్థితిలో ఉండగా ఒక్కసారిగా వికెట్లు చేజార్చుకోవడం బాధాకరం. 2003-04లో మెల్‌బోర్న్ టెస్టులో టీమ్‌ఇండియా 311/3తో పటిష్ఠంగా ఉంది. విచిత్రంగా మిగిలిన ఏడు వికెట్లను 55 పరుగుల వ్యవధిలో చేజార్చుకొని 366కి ఆలౌటైంది. 1997-98లో ముంబయి టెస్టులో విండీస్‌తో టీమ్‌ఇండియా తలపడింది. 471/3 నుంచి 41 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు చేజార్చుకొని 512కు పరిమితమైంది.