దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించే దిశగా సాగుతోంది. మూడో రోజు లంచ్ సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా 143 పరుగుల ఆధిక్యం సాధించింది. రిషబ్ పంత్ (51 బ్యాటింగ్: 60 బంతుల్లో నాలుగు ఫోర్లు, ), విరాట్ కోహ్లీ (28: 127 బంతుల్లో, నాలుగు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ, జాన్సెన్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
57-2 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లో పుజారా, రెండో ఓవర్లో రహానే వికెట్లను టీమిండియా కోల్పోయింది. దీంతో ఆ తర్వాత వచ్చిన పంత్, విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడారు.
పంత్ వన్డే క్రికెట్ తరహాలో దూకుడుగా ఆడగా.. విరాట్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. ఒకానొక దశలో విరాట్ 61 బంతుల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు పంత్ మాత్రం షాట్లు కొడుతూ, సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 72 పరుగులు జోడించారు.
సరిగ్గా లంచ్‌కు ముందు ఓవర్లో పంత్ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 58 బంతుల్లోనే తన అర్థసెంచరీ పూర్తయింది. ఈ సెషన్‌లో కూడా వీరిద్దరూ వికెట్ పడకుండా ఆడితే భారత్ కచ్చితంగా భారీ స్కోరు సాధించగలదు. అప్పుడు మ్యాచ్‌పై పట్టు లభిస్తుంది.